ఆడుతూ.. గెలుస్తూ..
● క్రీడల్లో సంస్కృత పాఠశాల
విద్యార్థుల ప్రతిభ
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నెల్లూరులోని వేద పాఠశాల విద్యార్థులు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. పేద, బడుగు వర్గాలకు చెందిన వారు రాణించేలా ఇక్కడ వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదిగారు.
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తెలుగు, సంస్కృత పద్యాలను నేర్పించేందుకు నగరంలోని వేద సంస్కృత పాఠశాలను 1953లో ఏర్పాటు చేశారు. సంస్కృతంతోపాటు సంప్రదాయాలను నేర్పించడంలో ఆ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు మూలాపేట దేవాలయాల్లో విధులు నిర్వహించే వారి పిల్లలు మాత్రమే చదివే పాఠశాలలో ఇప్పుడు అన్నివర్గాల చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. 15 ఏళ్లుగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు తాజాగా త్రోబాల్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఇద్దరు ఎంపిక
త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులు జి.గోపీచంద్, ఎం.మహేష్ పదో తరగతి చదువుతున్నారు. వీరు 2, 3వ తరగతుల నుంచే ఉదయం, సాయంత్రం క్రీడల్లో సాధన చేసేవారు. వారి ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వాలీబాల్, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. స్కూల్ గేమ్స్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించారు.
కూలీల పిల్లలు
గోపీచంద్ తల్లిదండ్రులు రాజేశ్వరి, రాములు బేల్దారి కూలీలు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా పాఠశాల ఇచ్చిన ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. మహేష్ అయితే ఆర్థికంగా మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుమారుడిని చదివిస్తోంది. మహేష్ సంస్కృత భాషను అభ్యసిస్తూనే ఉదయం, సాయంత్రం క్రీడల్లో సాధన చేస్తుంటాడు. బాగా చదివి క్రీడల్లో రాణించి పోలీసు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని నిరంతరం కష్టపడుతున్నాడు.
విద్యార్థులకు ప్రోత్సాహం
ఒకప్పుడు ఒక వర్గానికే విద్యకు స్థానమిచ్చే పాఠశాల మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను స్వీకరిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకునే పిల్లలకు అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. చిన్నారులకు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తమ భవిష్యత్‌ను అందించవచ్చు.
– ప్రభాకర్‌రావు, కరస్పాండెంట్
క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే సరైన ఫలితం లభిస్తుంది. పాఠశాలలో ఈ పనిచేయడంతో 20 ఏళ్లుగా చిన్నారులు పలు క్రీడల్లో ప్రతిభను చాటుకుతున్నారు. సంప్రదాయ విద్యను వివిధ వర్గాల వారు అభ్యసిస్తూనే ఇలా క్రీడల్లో రాణించడం అభినందనీయం. యాజమాన్యం భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తుంది.
– చంద్రశేఖర్, పీఈటీ
అన్ని రంగాల్లో రాణించాలి
మారుతున్న కాలంతోపాటు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. ప్రస్తుతం సమయాన్ని వృథా చేసే అనేక పరిస్థితులు ఉన్నా విద్యార్థులు సంప్రదాయ విద్య, క్రీడా రంగాల్లో రాణించడం అభినందనీయం. – చతుర్వేదుల శ్రీరామమూర్తి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు
ఆడుతూ.. గెలుస్తూ..
ఆడుతూ.. గెలుస్తూ..
ఆడుతూ.. గెలుస్తూ..
ఆడుతూ.. గెలుస్తూ..
ఆడుతూ.. గెలుస్తూ..
ఆడుతూ.. గెలుస్తూ..


