వైభవం.. అయ్యప్ప స్వామి నగరోత్సవం
● సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు వేదాయపాళెంలో ఉన్న శ్రీస్వామి అయ్యప్ప దేవస్థానంలో 41 రోజులుగా జరుగుతున్న మండల పూజోత్సవాల ముగింపు సందర్భంగా నగరోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అయ్యప్ప సేవా సమాజం పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం పర్యవేక్షణలో శబరిమలవాసుని ఉత్సవం కనులపండువగా జరిగింది. తొలుత దేవస్థానం నుంచి ఉదయం 9 గంటలకు ఉత్సవం రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి చేరింది. మధ్యాహ్నం భక్తులకు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి జ్ఞాపకార్ధం సతీమణి రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామిని విశేషాలంకారంలో కొలువుదీర్చారు. రంగనాథస్వామి ఆలయం నుంచి నగరోత్సవం మంగళవాయిద్యాలు, సింగారిమేళం, నగర సంకీర్తనలు, కోలాటాలు, పండరి భజనల నడుమ వైభవంగా సాగింది. రంగనాయకులపేట, సంతపేట, ఏసీ బొమ్మ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, ఏసీ మార్కెట్, మద్రాస్ బస్టాండ్, కేవీఆర్ పెట్రోలు బంక్, ఏసీ స్టేడియం, కరెంటాఫీస్ సెంటర్ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయానికే చేరింది. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కోశాధికారి గడ్డం రత్నయ్య, సభ్యులు పావళ్ల ప్రసాద్, బొగ్గుల మురళీమోహన్‌రెడ్డి, పసుపులేటి అశోక్‌తేజ, కేజీ శంకరన్, ముంగమూరు కృష్ణచైతన్య తదితరులు పాల్గొని పర్యవేక్షించారు.
● అయ్యప్పస్వామి మండల పూజోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు దేవస్థాన ప్రాంగణంలోని పుష్కరిణిలో ఆరాట్టు ఉత్సవం (చక్రస్నానం) జరుగుతుంది.
వైభవం.. అయ్యప్ప స్వామి నగరోత్సవం
వైభవం.. అయ్యప్ప స్వామి నగరోత్సవం


