
బైక్‌ను ఢీకొట్టిన కారు
● ఒకరి మృతి
● పలువురికి గాయాలు
కందుకూరు: ఓ వ్యక్తి మోటార్‌బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం నూతన జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వలేటివారిపాళెం గ్రామానికి చెందిన కట్టా అంజయ్య, అతడి భార్య పుష్ప, కొడుకు అనిల్, కోడలు దివ్య బుధవారం మధ్యాహ్నం ఒంగోలులో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరిగి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో పట్టణంలోని పోతురాజుమిట్ట ప్రాంతానికి చెందిన గోతాల వ్యాపారం చేసే ఎస్.రమణయ్య (60) పని నిమిత్తం బైక్‌పై ఉలవపాడు వెళ్లి తిరిగి కందుకూరు వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని నూతన జాతీయ రహదారిని చుట్టుగుంట అడ్డరోడ్డు వద్ద దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అటువైపు నుంచి వలేటివారిపాళెం వెళ్తున్న అంజయ్య కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రమణయ్య ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. కారు పల్టీలు కొట్టి రోడ్డు కింద మట్టిదిబ్బపై నిలిచిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించిన కారు అద్దాలు పగులగొట్టి లోపలున్న వారిని బయటకు లాగారు. పుష్ప తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.