డీటీపై ఆర్డీఓ ఆగ్రహం
వింజమూరు(ఉదయగిరి): స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఓబయ్యపై కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఫైరయ్యారు. స్థానిక సివిల్ సప్లయ్స్ గోదాములో అదనపు బాధ్యతలను స్వీకరించాలని ఉత్తర్వులను జారీ చేసినా, ఆయన విధుల్లో చేరకపోవడంపై మండిపడ్డారు. ఆదేశాలను బేఖాతర్ చేసిన తరుణంలో సస్పెన్షన్‌కు నివేదికను పంపాలని తహసీల్దార్ హమీద్‌ను అదేశించారు. వింజమూరు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌ను బుధవారం తనిఖీ చేసిన సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. ఉదయగిరి ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో రూ.కోటి విలువజేసే రేషన్ బియ్యం ఇటీవల పక్కదారి పట్టడం సంచలనాన్ని సృష్టించింది. ఈ వ్యవహారంలో గోదాములో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర ఉందనే విషయం తేలింది. దీంతో జిల్లాలోని అన్ని గోదాముల నుంచి తప్పించి, ప్రభుత్వోద్యోగులకు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జేసీ జారీ చేశారు. ఇదే సమయంలో వింజమూరు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌కు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను నియమిస్తూ గత నెల్లో ఉత్తర్వులివ్వగా, ఆయన విధుల్లో చేరలేదు. దీంతో రూ.కోట్ల విలువజేసే డిసెంబర్ నెల సరుకుల పంపిణీని అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి నిర్వహించారు. ఇదే సమయంలో కార్యాలయంలో పనిచేసే డీటీ ఓబయ్యను నియమిస్తూ ఉత్తర్వులొచ్చాయి. అయితే తన ఆరోగ్యం బాగొలేదని చెప్తూ విధుల్లో చేరలేదు. దీంతో జవవరి నెల సరుకులను ప్రైవేట్ వ్యక్తితోనే పంపిణీ చేయాల్సి ఉంది. మరో ఐదు రోజుల్లో ఈ నెల ముగుస్తున్నా, రేషన్ షాపులకు బియ్యం, ఇతర సరుకులు ఇంతవరకు సరఫరా కాలేదు. దీంతో ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌ను ఆర్డీఓ తనిఖీ చేశారు. ఇంతవరకు సరుకులు వెళ్లకపోవడంపై ఆరాతీశారు. గోదాము ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రహించి డీటీ ససెన్షన్‌కు ఆదేశించారు. దీంతో గత నెల ఉత్తర్వుల్లో పేరున్న సుధాకర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు.


