జామాయిల్ చెట్ల తొలగింపునకు యత్నం
కలిగిరి: కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెంలోని మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన భూముల్లో జామాయిల్ చెట్ల తొలగింపునకు వచ్చిన యంత్రాలను గ్రామస్తులు, రైతులు బుధవారం అడ్డుకున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని చారిటబుల్ ట్రస్ట్‌కు కలిగిరి రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 1012 / 1లో 3.22 ఎకరాల భూములున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల విలువ రూ.కోట్లకు చేరింది. వాస్తవానికి 1996లో మాగుంట చారిటబుల్ ట్రస్ట్‌కు 1012 / 1లో 4.22 సెంట్లను ఎకరా రూ.నాలుగు వేలకు ప్రభుత్వం అందజేసింది. ఇందులో 80 సెంట్లను ఎస్సీ కాలనీకి శ్మశాన నిమిత్తం కేటాయించారు. ఈ నేపథ్యంలో జామాయిల్ చెట్లను ఈ ఏడాది అగస్ట్ 30న నరుకుతుండగా, స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు ట్రస్ట్ భూములను రూ.4.6 కోట్లకు విక్రయించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ వింజమూరు మండలానికి ఓ టీడీపీ నేత తాను ట్రస్ట్ భూములను కొనుగోలు చేశానని, పనులను అడ్డుకోవద్దంటూ కొందరు గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా సదరు స్థలంలో లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సదరు వ్యక్తి యత్నాలను ప్రారంభించారని సమాచారం. అప్పట్లో గ్రామస్తులతో ట్రస్ట్ మేనేజర్ చర్చలు జరిపారు. దీనిపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాల క్రమంలో భూముల జోలికి రాకుండా ట్రస్ట్ నిర్వాహకులు, టీడీపీ నేతలు కొంతకాలం మౌనం దాల్చారు. తాజాగా జామాయిల్ చెట్లను తొలగించేందుకు గానూ భారీ యంత్రాలను అర్ధరాత్రి తీసుకొచ్చి పనులకు యత్నించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ భూముల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టాలే తప్ప.. విక్రయిస్తే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. భూములు అన్యాక్రాంతమైతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


