సూపర్ సక్సెస్
సూళ్లూరుపేట: నింగిలోన అద్భుతం.. నేలపై దరహాసం.. ఈ పరిస్థితి బుధవారం షార్‌లో ఆవిష్కృతమైంది. 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూ బర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. అమెరికాకు చెందిన ఈ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగంతో అగ్రదేశాలకు సాధ్యం కాని రికార్డును ఇస్రో సొంతం చేసుకోవడంతో భారతావని పులకించింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సాగిన ఈ ప్రయోగాన్ని కనులారా వీక్షించిన ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో సత్తా చాటిన ఇస్రో శాస్త్రవేత్తల కృషికి సాహో అన్నారు. నింగిలోకి ఎల్‌వీఎం3 – ఎం6 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా దూసుకెళ్లి బ్లూ బర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంతో విజయానందం పంచుకున్నారు.
విజయవంతంగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్యపరంగా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 8.59 గంటలకు ఎల్‌వీఎం3 – ఎం6 ఉపగ్రహ వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించి, వినువీధిలో విజయకేతనం ఎగురవేసింది. 2014లో ప్రారంభించిన ఎల్‌వీఎం3 రాకెట్ వరుసగా తొమ్మిది ప్రయోగాలు చేసింది. విజయవంతంగా వంద శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతోంది. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఎల్‌వీఎం3 – ఎం6 లాంటి భారీ రాకెట్ ద్వారా సమాచార ఉపగ్రహాల్లోనే 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్ – 2 ఉపగ్రహాన్ని ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఎల్‌వీఎం3 రాకెట్లు దేశీయ అవసరాలతోపాటు గ్లోబల్ కమర్షియల్ లాంచ్ సర్వీస్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాయి. 2022, 2023 సంవత్సరాల్లో వన్‌వెబ్ – 1, వన్‌వెబ్ – 2 అనే సుమారు 72 ఉపగ్రహాలను రెండు ప్రయోగాల్లోనే వాణిజ్యపరంగా ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్చచకితులను చేసింది. అంటే ఇస్రోలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మాత్రమే వాణజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగపడేది. ఇప్పుడు ఎల్‌వీఎం3 లాంటి భారీ రాకెట్ కూడా వాణిజ్యపరమైన ప్రయోగాలకు అనువుగా ఉందని ఈ మూడు ప్రయోగాలు నిరూపించాయి.
తొమ్మిదోసారి విజయం
ఎల్‌వీఎం3 రాకెట్ వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తల అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ రాకెట్ ద్వారా వాణిజ్యపరంగా వేసిన మూడో అడుగు కూడా విజయవంతం కావడంతో భవిష్యత్‌లో ఎల్‌వీఎం3 రాకెట్ కూడా మరో ఆదాయాన్ని తెచ్చిపెట్టే గనిగా మారింది. రాకెట్‌లోని ఎస్ – 200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్ – 110 ద్రవ ఇంధన దశ, సీ – 25 క్రయోజనిక్ దశల వారీగా విజయవంతంగా పనిచేయడంతో ఎల్‌వీఎం3 – ఎం6 రాకెట్ మరో విజయాన్ని సాధించి, ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. మంగళవారం ఉదయం 8.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 24 గంటలు కొనసాగిన అనంతరం బుధవారం ఉదయం 8:59 నిమిషాలకు ప్రయోగాన్ని చేపట్టి భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రను మరోసారి తిరగరాసింది. కౌంట్‌డౌన్ పూర్తి కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో అంతా నిశ్శబ్ద వాతావరణం మధ్య 10, 9, 8, 7, 6 అంటూ మైక్‌లో అంకెలు చెబుతున్నారు. మళ్లీ 5, 4, 3, 2, 1, 0 అనగానే తూర్పున తొలిసంధ్య కిరణాలు, మబ్బులను చీల్చుకుంటూ పెద్ద శబ్దంతో ఎల్‌వీఎం3 – ఎం6 రాకెట్ నిప్పులు చిమ్ముతూ 6,400 కిలోలు బరువు కలిగిన బ్లూ బర్డ్ బ్లాక్ – 2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగికి ఎగిరింది. అనంతరం మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసి, కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేిసి మూడో దశలో అమర్చిన సీ – 25 అంటే 25 టన్నుల క్రయోజనిక్ ఇంధన సాయంతో రాకెట్ శిఖర భాగంలో అమర్చిన ఉపగ్రహాన్ని 16 నిమిషాలకు దిగ్విజయంగా నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి విజయం సాధించారు.
దశలవారీగా పరిశీలిస్తే..
● ఎల్‌వీఎం3–ఎం6 రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగించారు. 43.5 పొడవు కలిగి 642 టన్నుల బరువుతో నింగివైపునకు దూసుకెళ్లింది. మొదటి దశలో రాకెట్‌కు ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్ – 200 బూస్టర్లు సాయంతో నింగి వైపునకు నిప్పులు చిమ్ముకుంటూ వెళ్లింది.
● మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.46 సెకండ్లలో విజయవంతంగా పూర్తి చేశారు. 174 సెకండ్లకు రాకెట్ శిఖరభాగాన ఉపగ్రహానికి అమర్చిన దశలో హీట్ షీల్ట్‌ప్ విజయవంతంగా విడిపోయాయి.
● రెండో దశలో ఎల్ – 110 అంటే ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 301.96 సెకండ్లకు విజయవంతంగా పూర్తి చేశారు.
● మూడోదశలో సీ–25 అంటే 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి 927 సెకండ్లకు పూర్తి చేసి, కటాప్ చేశారు. రాకెట్‌కు శిఖరభాగాన అమర్చిన 6,400 కిలోల బరువు కలిగిన బ్లూ బర్డ్ బ్లాక్ – 2 ఉపగ్రహాన్ని క్రయోజనిక్ దశతో 942.52 సెకండ్లకు భూమికి 520 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
విజయాలబాటలో..
షార్ నుంచి ఎల్‌వీఎం3 – ఎం6 రాకెట్ 104 ప్రయోగం. ఉపగ్రహాలతో చేసిన ప్రయోగాల్లో ఇది వందో ప్రయోగం కావడం, ఇస్రో రూపొందించిన రాకెట్లలో ఎల్‌వీఎం3కు బాహుబలి రాకెట్‌గా పేరు రావడం విశేషం.
సందడే సందడి
షార్ నుంచి ప్రయోగించిన ఎల్‌వీఎం3 – ఎం6 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు పదివేల మందికి పైగా విచ్చేశారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు కార్లు, స్కూల్ వ్యాన్‌లు, బస్సులు బారులు తీరి కనిపించాయి. అయితే షార్ కేంద్రం వారు మాత్రం ప్రతి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు అనువుగా శ్రీహరికోటలోనే ఒక ప్రత్యేక గాలరీని ఏర్పాటు చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మామూలుగా ప్రయోగాన్ని వీక్షించాలనుకునే వారంతా పులికాట్ సరస్సులో రోడ్డంతా కిక్కిరిసినట్టుగా కనిపించారు. రాకెట్ నింగికేగురుతున్న సమయంలో వారంతా కొట్టిన చప్పట్లు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రయోగం విజయవంతం కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
అభినందనలు
శ్రీహరికోట రాకెట్‌కేంద్రం నుంచి ఎల్‌వీఎం3 – ఎం6 ప్రయోగం విజయవంతం కావడంతో ఎంపీ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వకర్త కిలివేటి సంజీవయ్య ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఎల్‌వీఎం3–ఎం6 వరుసగా తొమ్మిదోసారి విజయం
కక్ష్యలోకి చేరిన
అమెరికా ఉపగ్రహం
సూపర్ సక్సెస్
సూపర్ సక్సెస్
సూపర్ సక్సెస్


