లీగల్ కౌన్సెలర్ విధుల నుంచి తొలగింపు
నెల్లూరు(పొగతోట): కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న లీగల్ కౌన్సెలర్ ఎన్.దేవి ప్రియదర్శినిపై అవినీతి ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించినట్లు ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గృహ హింస చట్టం (డీవీసీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ కౌన్సెలర్ విధులు నిర్వహిస్తున్న ఆమైపె బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని రుజువైందన్నారు. గృహ హింసకు గురైన బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్న లీగల్ కౌన్సెలర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
శ్రామికుల సంఖ్య పెంచండి
● డ్వామా పీడీ గంగా భవాని
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగా భవాని ఆదేశించారు. బుధవారం నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించాలన్నారు. వాటిని శ్రామికుల చేత చేయించాలని సూచించారు. ఇంకుడుగుంతలు, గోకులాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం సాధించాలన్నారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
నెల్లూరు సిటీ: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దొరతోపు కాలనీకి చెందిన రౌడీషీటర్ సురేంద్ర వీరయ్యపై రూరల్ పోలీసులు బుధవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న మోటార్‌బైక్
● వ్యక్తి మృతి
మర్రిపాడు: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి మోటార్‌బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం రాత్రి నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై పొంగూరు సమీపంలోని అచ్చమాంబ గుడి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పొంగూరుకు చెందిన సుబ్బరాయుడు (58) బైక్‌పై మర్రిపాడుకు వెళ్తున్నాడు. పొంగూరు సమీపంలోకి వచ్చేసరికి పంక్చరై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నాడు. ప్రమాదంలో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని భార్య, ఇద్దరు కుమారులున్నారు. సమాచారం తెలుసుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
విద్యార్థులకు
దుప్పట్ల పంపిణీ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 16 మెట్రిక్ హాస్టళ్లలో చదువుతున్న 1,120, సోషల్ వెల్ఫేర్ పరిధిలోని 12 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుతున్న 1,000 మంది విద్యార్థులకు దుప్పట్లు అందజేసినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారిణి పి.వెంకటసుబ్బమ్మ తెలిపారు. నగరంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు, వార్డెన్లకు దుప్పట్లను బుధవారం పంపిణీ చేశారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జిల్లాలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. థ్యాంక్యూ కలెక్టర్ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రజలను రెచ్చగొడితే ఊరుకోను
● మంత్రి నారాయణ
నెల్లూరు(బారకాసు): రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, టిడ్కో, హౌసింగ్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యను సత్వరం పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంట కాలువల ఆధునికీకరణ పనుల్లో ఆక్రమణల తొలగింపులో మార్పులు చేసామన్నారు. 80 శాతం ఇళ్లు తొలగించాల్సిన అవసరం లేదన్నారు. మిగిలిన 20 శాతం మందిలో పేదలుంటే ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మున్సిపల్ హైస్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం సహాయనిధి ద్వారా 29 మందికి రూ.22,42,308 చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్డీఓ అనూష, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
లీగల్ కౌన్సెలర్ విధుల నుంచి తొలగింపు


