దుర్గంలో పెద్ద పులి సంచారం
ఉదయగిరి: ఉదయగిరి దుర్గంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్ద పులులు సంచారిస్తున్నాయనే అనుమానాలకు మంగళవారం రాత్రితో తెరపడింది. బండగానిపల్లి ఘాట్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి పెద్ద పులి కంటపడింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. బిజ్జంపల్లికి చెందిన నాయబ్ అనే టైలర్ 18 ఏళ్లుగా ఉదయగిరిలో దర్జీ పనిచేస్తూ రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే రాత్రి 7.30కు షాపును మూసేసి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఇంటికి ఘాట్ రోడ్డులో బయల్దేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతానికి వెళ్లగా, బండగానిపల్లి ఘాట్‌రోడ్డులోని కనుమ బావి మలుపు వద్ద రోడ్డుపై కూర్చొని ఉన్న పెద్దపులి కంటపడింది. 12 అడుగుల దూరంలో ఉన్న పులిని గమనించి షాక్‌కు గురై బైక్‌ను ఆపేశారు. దీంతో పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సమయం వేచి ఉండి ఆపై వారు బయల్దేరారు. దీనిపై అటవీ అధికారులకు ఫోన్లో తెలియజేశారు. విషయం బుధవారం ఉదయానికి అందరికీ తెలిసిపోయింది. దీంతో అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్లి పాదముద్రలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఫారెస్ట్ అధికారి కుమారరాజా తన సిబ్బందితో వెళ్లి పాదముద్రలను సేకరించారు. వివరాలను నిపుణులకు ఫోన్లో తెలియజేయగా, పెద్దపులి అని చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని అటవీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. పాదముద్రల విశ్లేషణ అనంతరం నివేదిక ఆధారంగా వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ప్రాంతంలో రాత్రివేళ ఎవరూ ఒంటరిగా రాకపోకలు సాగించొద్దని సూచించారు. మరోవైపు పెద్ద పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
ముమ్మరంగా కూంబింగ్
కూంబింగ్‌ను పోలీస్, అటవీ అధికారుల బృందం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఘాట్ రోడ్డులో ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. బండగానిపల్లి, బిజ్జంపల్లి, చెరువుపల్లి, చెర్లోపల్లి, కొత్తపల్లి, కృష్ణారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతానికి సమూహంగా వెళ్లాలని సూచించారు.
దుర్గంలో పెద్ద పులి సంచారం


