ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తీరే వేరయా..!
208 అంగన్‌వాడీ కేంద్రాలకు
ఒక్కరే సూపర్‌వైజర్
కొన్నేళ్లుగా భర్తీ కాని పోస్టులు
గాడి తప్పిన పర్యవేక్షణ
శ్రద్ధ చూపని పాలకులు, అధికారులు
ఉదయగిరిలో ఇదీ పరిస్థితి
ఉదయగిరి: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఆసక్తి చూపడంలేదు. బదిలీల్లో ఒకరిద్దరు వచ్చినా, విధుల్లో వారు చేరడం లేదు. దీంతో ప్రాజెక్ట్‌లో పోస్టులు ఎంతో కాలంగా భర్తీ కావడం లేదు. మరోవైపు వింజమూరు ప్రాజెక్ట్‌లో మాత్రం సూపర్‌వైజర్లు పూర్తి స్థాయిలో ఉండటం గమనార్హం.
కేంద్రాలపై పర్యవేక్షణేదీ..?
ఉదయగిరి ప్రాజెక్ట్ పరిధిలో వరికుంటపాడు, పెద్దిరెడ్డిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, ఉదయగిరి – 1, 2, గండిపాళెం, సీతారామపురం, ఎస్సార్‌నగర్ సెక్టార్లున్నాయి. వాస్తవానికి ఒక్కో సెక్టార్‌కు ఒక సూపర్‌వైజర్ ఉండాలి. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలో 208 కేంద్రాలుండగా, ఇక్కడ మూడు వేల మందికి పౌష్టికాహారాన్ని రోజూ అందిస్తున్నారు. అయితే వీటన్నింటినీ ఒక్కరే పర్యవేక్షించాల్సి వస్తుండటంతో, ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. ఫలితంగా కేంద్రాలు సజావుగా పనిచేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహారం సైతం సక్రమంగా అందడంలేదని తెలుస్తోంది.
మాకెందుకు..?
ఉదయగిరి ప్రాజెక్ట్ పరిధిలో పోస్టుల భర్తీ విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 20 నెలలు కావస్తున్నా, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకులు సైతం దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆలనాపాలనా కరువైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తీరే వేరుగా ఉంటోంది. వాస్తవానికి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవర్నైనా నియమించినా, రాజకీయ సిఫార్సులతో అది ఆగిపోతుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఈ తంతు నడుస్తోంది. పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పాలకులు, అధికారులు పెద్దగా దృష్టి సారిస్తున్న దాఖలాల్లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


