యూరియాను ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: రైతులకు యూరియాను అందించలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బిరదవోలు చెర్లోపల్లిలో బుధవారం పర్యటించారు. గ్రామానికి చెందిన పార్టీ నేత బత్తల గోపాల్‌రెడ్డి కర్మక్రియలకు హాజరైన ఆయన్ను రైతలు కలిసి తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. యూరియా సక్రమంగా లభించడంలేదని, నిమ్మకాయలకు కోతకూలీలు సైతం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధరల్లేక నిమ్మ రైతులు అవస్థలు పడుతున్నారని, కాడి వదిలేసేలా వారున్నారని చెప్పారు. యూరియా లభ్యం కాక అష్టకష్టాలు పడుతున్నారని, దిగుమతయ్యే దాన్ని టీడీపీ నేతలు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. క్యూల్లో గంటల తరబడి కర్షకులు నిరీక్షించి, తీరా అది లేదంటుండటంతో వెనుదిరుగుతున్నారని చెప్పారు. దిత్వా తుఫాన్‌తో దెబ్బతిన్న నారుమడుల రైతులకు గత సీజన్లో మిగిలిపోయిన విత్తనాలను రాయితీపై పంపిణీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కాలం చెల్లిన వీటి పంపిణీతో మొలకెత్తపోవడంతో మరింత నష్టపోయారని ఆరోపించారు. గతంలో ఉక్రెయిన్ యుద్ధంతో ధాన్యం ధరలు పెరిగాయని సోమిరెడ్డి చెప్తే, అదే యుద్ధంతో యూరియాకు కొరత ఏర్పడిందంటూ పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దేవుడి ఆస్తులపై కన్నేసిన సోమిరెడ్డి
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రజల ఆస్తులతో పాటు ఏకంగా దేవుడి ఆస్తులపైనే సోమిరెడ్డి కన్నేశారని ఆరోపించారు. కాకుటూరు శివాలయ భూములను విక్రయంచిన అంశంపై ప్రశ్నించిన తనపై పోలీస్ కేసును పెట్టారని.. కృష్ణపట్నం వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో ముడుపులు ముట్టకపోవడంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆలయానికి సంబంధించిన రూ.మూడు కోట్ల పనులకు టెండర్లు పిలిచి.. టెక్నికల్ బిడ్లు తెరిచి.. ఫైనాన్షియల్ బిడ్లు తెరవకుండా ఎవరడ్డుకుంటున్నారో దేవదాయ శాఖ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పొదలకూరు పట్టణంలో లేఅవుట్ల యజమానుల నుంచి డబ్బులు దండుకునే సంప్రదాయానికి సోమిరెడ్డి నాంది పలికారని మండిపడ్డారు. సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఎందరో పనిచేశారని, ఇలా వీరెవరూ దండకాలు సాగించలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతే అజెండాగా మార్చుకొని ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. తమకు అధికారంతో పనిలేదని.. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, కోనం చినబ్రహ్మయ్య, రావుల ఇంద్రసేన్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, బత్తల పెంచలరెడ్డి, గోపాలయ్య, సుధాకర్‌రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.


