అన్నింటికీ రైతుపైనే భారం
ప్రకృతిని పరవశించే పచ్చని పంట పొలాలు. ఊరూరితో మమేకమైన పల్లెసీమలు. తొలిపొద్దు అక్కడి నుంచి ప్రారంభమైనట్లు కనిపించే సముద్రం. అలల సవ్వడితో
పరవశించే ‘తీరం’లో పెట్రో పిడుగు పడనుంది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగితే ఇప్పుడు కనిపించే సుందర, మనోహర దృశ్యాలు ఇక కనిపించవు. వ్యవసాయం, పాడి, కల్లుగీత పనుల్లో నిమగ్నమైన పల్లె జనం. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలు,
వేరుశనగ, చేమ, మామిడి తోటలతో అలరారే మండలంలోని చెన్నాయపాళెం, ఆనెమడుగు, సర్వాయపాళెం, పెద్దపట్టపుపాళెం గ్రామ సీమలు కనుమరుగు కానున్నాయి.
భూసేకరణ చేసే గ్రామాల్లో ఉన్న పచ్చని పొలాలు
రైతులకు వాటాలివ్వాలి
బీపీసీఎల్ ప్రాజెక్ట్ కోసం కావలి మండలంలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణలో భూమి కోల్పోయే రైతులకు పరిశ్రమల్లో వాటాలు ఇవ్వాలి. బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ సంస్థ అంటే ప్రజలదే. అదే ప్రజలకు ప్రాజెక్ట్‌లో వాటాలు ఇవ్వడానికి అభ్యంతరాలు ఎందుకు. ఇవి ఎలాగో చేయరు. కాబట్టి మార్కెట్ ధర కన్నా పది రెట్లు ఎక్కువ ఇవ్వాలి. భూసేకరణ మొత్తం రహస్యంగా సాగుతోంది. ఇందులో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశాలు లేవు.
– దామా అంకయ్య, సీపీఐ కార్యదర్శి, నెల్లూరు జిల్లా
కావలి: కావలికి సమీపంలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా సముద్ర తీరం వెంబడి ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను బీపీసీఎల్ చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదించింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించింది. కానీ భూ సేకరణ సమస్య కారణంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్‌ను రామాయసట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, స్థల పరిశీలన, భూసేకరణ, పర్యావరణ ప్రభావం, ఇంజినీరింగ్ డిజైన్లు తదితర కార్యక్రమాలకే సుమారు రూ.6,100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. వచ్చే డిసెంబర్‌లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఫీడ్ బ్యాక్, అధ్యయనాల నివేదికలు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు ఎంత ఉంటుందో అంచనాకు రానున్నారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని బీపీసీఎల్ పరిశీస్తోంది. తుది ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 48 నెలలకు ప్రాజెక్ట్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుమారు 6 వేల ఎకరాల భూమి అవసరం అవసరం కానుండడంతో ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చాపకింద నీరులా చేస్తోంది. ఇందుకు అవసరమైన భూముల్లో సుమారు 4 వేల ఎకరాలు పట్టా భూములు, 2 వేల ఎకరాలు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు కలిపి సేకరించే పనిలో ఉంది.
భూసేకరణే అసలు సమస్య
మహారాష్ట్రలో భూసేకరణలో ఎదుర్కొన్న అనుభావాలను దృష్టిలో పెట్టుకుని బీపీసీఎల్ కావలి మండలంలో భూసేకరణకు అవరోధాలు తలెత్తకుండా చేయాలని భావిస్తోంది. ఆ మేరకు ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు నష్టపరిహారంగా చెల్లించడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. అయితే తద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరు రంగ ప్రవేశం చేశారు. భూసేకరణలో కుయుక్తులు పన్నుతున్నాయి. ఎకరాకు ప్రభుత్వ ధరకు అటు ఇటుగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర నష్టపరిహారం చెల్లించి మిగతాది తమ జేబుల్లో వేసుకునేందుకు సదరు వ్యక్తులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే రైతులు మాత్రం ఎకరాకు రూ.50 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చినా తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
1,348 కోట్ల లీటర్ల
నీరు అవసరం
ఆయిల్ రిఫైనరీకి నీటి అవసరం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సాగు నీటిని అందించడానికి తరతరాలుగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు ఆగమేఘాలపై సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేస్తామని ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారం/ పెట్రోలియం శుద్ధి కర్మాగారం అనేది ఒక పారిశ్రామిక/రసాయన ప్రాసెసింగ్ ప్లాంట్. ఇక్కడ ముడి చమురును పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్ ఇంధనం, తాపన నూనె, కిరోసిన్, గ్యాస్, జెట్ ఇంధనంగా మారుస్తారు. ఆయిల్ శుద్ధి కర్మాగారాలు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. సాధారణంగా ఒక బ్యారెల్ (159 లీటర్లు) ముడి చమురును ప్రాసెస్ చేయడానికి 1.5 బ్యారెళ్ల నీరు అవసరం. ఈ ఆయిల్ శుద్ధి కర్మాగారంలో 9 మిలియన్ టన్నుల ఆయిల్ శుద్ధికి సుమారుగా 1,348 కోట్ల లీటర్లు అవసరం అవుతుంది. ఒక టీఎంసీ (2,831 కోట్ల లీటర్లు). అంటే ఇక్కడి వినియోగానికి ఏటా సుమారుగా అర టీఎంసీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కావలిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. తుమ్మలపెంట, మన్నంగిదిన్నె పంచాయతీల్లోని గ్రామాల్లో 3,500 ఎకరాలు భూసేకరణ చేయాలని తలపోసింది. రామాయపట్నం ఓడరేవుతో అనుసంధానించబడిన ప్రధాన పరిశ్రమలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా, కీలకమైన ఎగుమతి ద్వారంగా అభివృద్ధి చేయడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యం కోసం సమర్థ వంతమైన లాజిస్టిక్స్‌పై ఆధారపడే పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రధాన ప్రదేశంగా మారుతుందని బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా కాలుష్యభూతమైన పెట్రో శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి భూసేకరణ చేస్తున్నారు.
వాయు, జల కాలుష్యం తప్పదా?
ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో రసాయన ప్రక్రియలు ఉంటాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. రసాయన ఉద్గారాలతో విడుదలయ్యే విష వాయువుల కారణంగా వాయు, జల కాలుష్యానికి కారణమవుతాయి. ఈ వాయువులు హానికరం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాలుష్యం కారణంగా ఈ గ్రామాల సమీపంలో ఉండే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్లలకు శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా సోకుతాయి.
రామాయపట్నంలో
ఆయిల్, పెట్రో కెమికల్
కాంప్లెక్స్ ఏర్పాటుకు
సన్నాహాలు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
నిజమేనా?
6 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ
ఈ ప్రాజెక్ట్‌లో పచ్చని పొలాలు, నివాసాలు గల్లంతు
మార్కెట్ ధర చెల్లించేందుకు బీపీసీఎల్ సిద్ధం
ప్రభుత్వ విలువ చెల్లించి మిగతా కాజేసేందుకు
కొందరు పన్నాగాలు
రైతులకు, గ్రామాల్లో నివసించే ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ గ్యారెంటీ లేదు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కొందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించమని నవయుగ నిర్మాణ సంస్థను ఆ ప్రాంత ఎమ్మెల్యే అడిగితే వీలుపడదని తెగేసి చెప్పినట్లు సమాచారం. సుశిక్షతులైన కార్మికులు, ఉద్యోగులు తమకు అందుబాటులో ఉన్నారని, స్థానికులకు ఈ పనుల్లో అవగాహన లేదని, అందుకే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేమని ఎన్‌సీసీ ప్రతినిధులు స్పష్టం చేశారంట. అలాంటి బీపీసీఎల్‌లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ప్రచారం ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.
అన్నింటికీ రైతుపైనే భారం


