విచారణ.. సాదాసీదాగా..!
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి.. ఈ అంశాలపై ప్రచురితమైన వార్తలను ఆధారంగా చేసుకొని వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన విచారణ ప్రక్రియ సాదాసీదాగా జరిగింది. నెల్లూరులోని హరనాథపురంలో గల ఇరిగేషన్ సెంట్రల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం విజయవాడ వర్క్స్ అండ్ ఆడిట్ జేడీ శైలజ గురువారం వచ్చారు. ఎంకై ్వరీలో భాగంగా సెంట్రల్ డివిజన్లో ఈఈ నుంచి అక్కడ పనిచేస్తున్న అటెండర్లను పిలిచి వారికిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయించుకొని వాటిని స్వీకరించారు.
మమ.. అనిపించి..!
మేనేజర్ స్థాయిలో ఉండే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద ఎలా లంచాలు తీసుకున్నారనే విషయం అటెండర్ స్థాయి వారెలా చెప్పగలరో ఎవరికీ అంతుచిక్కడంలేదు. లంచాలిచ్చామని చెప్పిన కాంట్రాక్టర్లను విచారణకే పిలవకపోతే అసలు విషయం ఎలా బయటకొస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సంబంధిత అధికారులను సైతం పిలవకపోవడంతోనే అసలు ఎంకై ్వరీ తీరు ఎలా జరిగిందనే విషయం ఇట్టే అర్థమవుతోంది.
మౌనమే.. సమాధానం
విలేకరులు సంధించిన ఏ ప్రశ్నకూ.. జేడీ సమాధానమివ్వలేదు. విచారణాధికారిగా మిమ్మల్ని నియమించాక మీకు రూ.పది లక్షల లంచమిచ్చారనే ప్రచారం జరుగుతోందనే ప్రశ్నకు మాత్రమే స్పందించారు. మేనేజర్, తాను ఒకే శాఖ అయినా ఒక్కసారి ఆయనతో మాట్లాడలేదని.. విచారణలో తెలిసిన అంశాలను ప్రభుత్వానికి అందజేస్తానని, తనను మరే ప్రశ్న అడగొద్దని తెలిపారు. లంచమిచ్చామని చెప్పిన కాంట్రాక్టర్లను కనీసం విచారణకు పిలవకపోవడం.. పనులు చేయిస్తున్న కొందరు అధికారులనే ప్రశ్నించడంతో ఇదేమి ఎంక్వైరీనని ఆ శాఖలోని వారే పేర్కొంటున్నారు. దీని బట్టి మేనేజర్‌కు అధికార పార్టీ అండదండలున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
రంకెలేసిన మేనేజర్
తాను అవినీతికి పాల్పడితే నిరూపించాలనీ.. అయితే రాజకీయ నేతలు ప్రెస్‌మీట్లు పెడితే ఈ విచారణ ఏమిటనీ.. తానూ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేస్తాననీ.. సెలవులు పెడితే మీకెందుకు.. పెట్టకపోతే మీకెందుకు అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నలకు మేనేజర్ గంగాధర్‌రెడ్డి రంకెలేశారు. ఈ విషయమై ఎస్‌ఈను సంప్రదించగా, విచారణకు ఈఈగా హాజరయ్యాననీ, వారడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనదని చెప్పారు. కాగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు సాగిన విచారణలో ఏ మాత్రం వాస్తవాలు తెలిశాయో వేచి చూడాల్సిందే.
ఈఈ మొదలుకొని అటెండర్ల వరకు ఒకటే ప్రశ్నలు
ప్రశ్నపత్రాలిచ్చి జవాబులు
రాయించుకున్న వైనంగా తంతు
కాంట్రాక్టర్లను అసలు పిలవనేలేదు
కొంత మంది అఽధికారులపైనే ఎంకై ్వరీ
ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఇదండీ తీరు


