గంగమిట్టపై కొలువుదీరిన పోలేరమ్మ | - | Sakshi
Sakshi News home page

గంగమిట్టపై కొలువుదీరిన పోలేరమ్మ

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

పుష్పాలంకారంలో ముత్యాలమ్మ దర్శనం

తూర్పుకనుపూరు వైపు భక్తుల అడుగులు

చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రెండో రోజైన బుధవారం మెట్టినింట నుంచి గంగమిట్టపై కొలువుదీరేందుకు వచ్చిన పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గమధ్యలో తన సోదరి ముత్యాలమ్మను పలకరించిన అనంతరం తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీరారు.

పంబలోళ్ల వాయిద్యాల మధ్య

పోలేరమ్మ తల్లి గంగమిట్ట మీదకు వచ్చే సమయంలో దారిలో భక్తులు మొక్కులు చెల్లించారు. అమ్మవారికి నడకోకల మధ్య స్వాగతం పలికారు. ముందు గణాచారి నడుస్తుండగా పంబలోళ్లు వాయిద్యాలు, కొమ్ము బూరలు ఊదుతుండగా అమ్మవారిని గుడిసెలో కొలువుదీర్చారు. తర్వాత కుంభం పోసి దిష్టి తీర్పు తీర్చిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

యారా గురనాథస్వామి గ్రామోత్సవం

గణాచారి ముందు నడుస్తుండగా గొల్లలు వీరతాళ్లు వేస్తూ అక్క దేవతలతో పాటు గురనాథస్వామి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని కేరింతలు కొట్టారు.

అలసత్వం వద్దు

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని, అలసత్వం వహించి ఏదైనా జరిగితే సంబంధిత డ్యూటీ ప్రాంతంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని అడిషనల్‌ ఎస్పీ సౌజన్య తెలిపారు. బందోబస్తును ఆమె పరిశీలించి పలు సూచనలిచ్చారు. అలాగే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ, ముఖ్య నాయకులు, అధికారులు పోలేరమ్మ, ముత్యాలమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు.

తొలిరోజే లక్ష మందికిపైగా..

జాతరలో తొలిరోజు తూర్పుకనుపూరుకు లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు రాకముందే స్థానికంగా ఉన్నవారు దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరు ముత్యాలమ్మతో పాటు పోలేరమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement