ఎలాంటి పన్నులను చెల్లించకుండానే జిల్లాకు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, పరికరాలను పలువురు దుకాణదారులు దర్జాగా దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టవనే రీతిలో వ్యవహరిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుత | - | Sakshi
Sakshi News home page

ఎలాంటి పన్నులను చెల్లించకుండానే జిల్లాకు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, పరికరాలను పలువురు దుకాణదారులు దర్జాగా దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టవనే రీతిలో వ్యవహరిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుత

Mar 11 2026 7:26 AM | Updated on Mar 11 2026 7:26 AM

నెల్లూరు (టౌన్‌): జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, మొబైల్స్‌ తదితర పరికరాలకు ఎలాంటి పన్నులను చెల్లించకుండానే పలు దుకాణ యజమానులు భారీ మొత్తంలో విక్రయాలు సాగిస్తున్నారు. బిల్లులు చెల్లించకుండానే అమ్మి అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజానికి వీటికి జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీ మొత్తంలో గండి కొడుతున్నారు.

తనిఖీలతో వెలుగులోకి..

బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో ఇయర్‌ బడ్స్‌, ఛార్జర్లు, పౌచ్‌లు, ఇయర్‌ ఫోన్స్‌ తదితర డూప్లికేట్‌ వస్తువులను విక్రయదారులకు అంటగట్టి పెద్ద మొత్తంలో యజమానులు క్యాష్‌ చేసుకుంటున్నారు. వీటిపై తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నగరంలోని లస్సీ సెంటర్‌లో గల పలు మొబైల్స్‌ దుకాణాలపై పోలీస్‌ విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలను సోమవారం చేపట్టారు. ఈ క్రమంలో అంబికా, జేపీ మొబైల్స్‌ షాపుల్లో ఎలాంటి బిల్లుల్లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.49.24 లక్షల విలువజేసే సెల్‌ఫోన్లు, యాక్సెసరీస్‌ను స్వాధీనం చేసుకొని ఎస్జీఎస్టీ అధికారులకు అప్పగించారు. మరోవైపు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గల మొబైల్‌ ఫోన్ల దుకాణాలను యజమానులు మూసేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను మరిన్ని నిర్వహిస్తే, ఇలాంటి బాగోతాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

అబ్బే.. మాకెందుకు..!

రూ.300 దాటితే జీఎస్టీ నంబర్‌ ఉన్న ఒరిజినల్‌ బిల్లును వినియోగదారులకు ఇవ్వాలి. అయితే ఏ దుకాణాంలోనూ వీటిని ఇస్తున్న దాఖలాల్లేవు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ధర పెరుగుతుందనే సమాధానమొస్తోంది. ఒక్కో యజమాని రెండు రకాల బిల్లుల పుస్తకాలను ముద్రించి డూప్లికేట్‌ను అంటగడుతున్నారని తెలుస్తోంది. వీటిపై తనిఖీలను నిర్వహించి కఠినంగా వ్యవహరించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, మామూళ్ల మత్తులో జోగుతూ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, మొబైల్‌ ఫోన్ల దుకాణాల యజమానుల నుంచి ప్రతి నెలా ముడుపులను స్వీకరిస్తున్నారని సమాచారం. జీఎస్టీ చెల్లించని, డూప్లికేట్‌ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలపై మరిన్ని తనిఖీలను నిర్వహించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ను సంప్రదించేందుకు పలుమార్లు యత్నించగా, ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని కింది స్థాయి అధికారులు తెలిపారు.

ముంబై, చైన్నె తదితర ప్రాంతాల నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, మొబైల్స్‌, యాక్సెసరీస్‌ తదితర పరికరాలను జిల్లాకు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇవన్నీ దాదాపు చైనా వస్తువులుగా తెలుస్తోంది. యాపిల్‌, సామ్‌సంగ్‌ తదితర కంపెనీల పరికరాలకు సంబంధించిన ఒరిజినల్స్‌ స్థానంలో నకిలీలను అంటగడుతున్నారు. వీటి ధరలూ పెద్ద మొత్తంలోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ దుకాణాల యజమానులతో ముందుగానే మాట్లాడుకొని, అక్కడ్నుంచి లారీలు, పార్శిల్‌ వాహనాల్లో వీటిని తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇలా తరలించిన వాటి ద్వారా వ్యాపారం నిత్యం రూ.లక్షల్లో ఉంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల బ్రాండ్లు, కొత్త కంపెనీలకు సంబంధించిన పరికరాలను తరలిస్తున్నారని సమాచారం.

ఎలాంటి బిల్లుల్లేకుండానే

ఎలక్ట్రానిక్స్‌, పరికరాల దిగుమతి

వాస్తవానికి వీటిపై

18 శాతం జీఎస్టీ తప్పనిసరి

ఇవేవీ లేకుండానే యథేచ్ఛగా విక్రయాలు

సెల్‌ఫోన్ల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారుల ఆకస్మిక తనిఖీలు

బిల్లుల్లేని రూ.49.24 లక్షల విలువజేసే మొబైల్స్‌, యాక్సెసరీస్‌ స్వాధీనం

ప్రభుత్వాదాయానికి రూ.కోట్లల్లో గండి

పట్టనట్లు వ్యవహరిస్తున్న

వాణిజ్య పన్నుల అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement