● అక్రమ నిర్మాణాలకు అనుమతులు.. పెండింగ్ ఫైళ్లపై ఫిర్యాదులు
● డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో సోదాలు
● రికార్డుల పరిశీలన
నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆకస్మిక తనిఖీలను ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో అధికారులు మంగళవారం చేపట్టారు. అక్రమ కట్టడాలకు అనుమతులు.. ఫైళ్ల పెండింగ్.. అవినీతి ఆరోపణలపై సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 11.30కు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల నిర్వహణలో లోపాలు.. సిటిజన్ చార్టర్‌లో నిర్లక్ష్యం.. అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్.. అనధికారిక పర్మిషన్లతో పాటు డెస్కుల్లో ఫైళ్లను నిశితంగా పరిశీలించారు. సర్వేయర్లుండే గదిలో పలు ఫైళ్లను పరిశీలించి వివిధ అంశాలను ఆరాతీశారు. తనిఖీలను బుధవారం సైతం కొనసాగించనున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
మారని ఉద్యోగుల తీరు
నెల్లూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు ప్రజాప్రతినిధుల అండ, మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో ఇక్కడి ఆఫీసర్ల అవినీతి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలోనూ ఈ విభాగంలో ఏసీబీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేసి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఇక్కడ ఏ మాత్రం మార్పు రావడంలేదని కార్యాలయ ఉద్యోగులే పేర్కొంటున్నారు. మరోవైపు ఏసీబీ తనిఖీలతో టౌన్‌ప్లానింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విభాగానికి సంబంధించిన పలువురు అధికారులు అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం. సీఐలు విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


