నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు భయంతో బతుకుతున్నారని చెప్పారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అర్ధరాత్రి సైతం మహిళలు ధైర్యంగా తిరిగేవారని గుర్తుచేశారు. అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు తప్ప మహిళల భద్రతను ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అటకెక్కించి, మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తూ రాష్ట్రాన్ని మత్తులో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. గుమ్మళ్లదిబ్బలో బాలికపై జరిగిన దాడిని మరువక ముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరగడం హేయమన్నారు. కారకులపై చర్యలు చేపట్టకుండా.. బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వరిగొండలో బాలికపై జరిగిన దాడిని పోలీసులు ఎంత గోప్యంగా ఉంచాలని చూసినా, అది దాగలేదని చెప్పారు. జీజీహెచ్ హెచ్‌ఓడీ గీతాలక్ష్మిని సంప్రదించి వివరాలను కోరితే, బాలిక పేరు చెప్పాలని పదేపదే అడిగారని, పోక్సో చట్టం ప్రకారం పేరు వెల్లడించకూడదని తాము చెప్పినా వినలేదని తెలిపారు. ఐదో తేదీన హాస్పిటల్లో బాలిక చేరితే డాక్టర్లు, సిబ్బందికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చివరికి బాలికపై అఘాయిత్యం జరగలేదని, టీవీ దొంగతనానికి వెళ్లిన వారిని అడ్డుకోవడంతో గాయలయ్యాయని పోలీసులు తెలిపారన్నారు. ఒక సీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అఘాయిత్యం జరిగిందని, మరొకరు మాత్రం అలా జరగలేదని రాయడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. పోలీసుల అసమర్థత, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తనపై చిన్నబజార్ పోలీస్‌స్టేషన్లో గంజాయి కేసు నమోదైందని నిందితుడే స్వయంగా అంగీకరించిన అంశాన్ని ప్రస్తావించారు. బాలిక విషయం బయటకు రావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా కృష్ణపట్నం సీఐ, ముత్తుకూరు ఎస్సైను సస్పెండ్ చేశారని విమర్శించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని మాని, మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్పీ, హోంమంత్రిని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణను ఎలా కల్పించాలో జగనన్నను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. బాలిక కుటుంబానికి తమ పార్టీ అండగా ఉండి.. న్యాయం జరిగేంత వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. పార్టీ జోనల్ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, రూరల్, సర్వేపల్లి మహిళాధ్యక్షులు రమాదేవి, సంధ్యారాణి, దువ్వూరు సర్పంచ్ కృష్ణవేణి పాల్గొన్నారు.


