● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● ఏపీఎమ్మెస్‌ఐడీసీ అధికారులపై ఆగ్రహం
నెల్లూరు(అర్బన్): నగరంలోని పెద్దాస్పత్రిలో చిన్న కారణాలను చూపుతూ వైద్యసేవలను సక్రమంగా అందించకపోతే పేదలు, దళితులు, ఎస్టీలు ఎక్కడికెళ్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రశ్నించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏయే విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని ప్రశ్నించారు. ఈఎన్టీ, నేత్ర, ఆంకాలజీ విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని, న్యూరో సర్జన్ విభాగంలో ఒక్కటి సైతం జరగకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. వీటికి అవసరమైన కనీస పరికరాలు న్యూరో సర్జరీలో లేవని.. ఈఎన్టీలో పది నుంచి 15 మంది పేషెంట్లకు ఉపయోగించాక కొన్ని ఎక్విప్‌మెంట్లు పనికిరావని, కొత్తవి కావాల్సి ఉంటుందని ఆయా విభాగాల హెచ్‌ఓడీలు తెలిపారు. ఇవి లేకపోవడంతోనే ఆపరేషన్లు తగ్గిపోయాయని బదులిచ్చారు.
జాబితాను అందజేయండి
విభాగాల వారీగా కావాల్సిన అత్యవసర, కనీస అవసరాలు తీర్చే పరికరాల జాబితాను తయారు చేయించి డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి ద్వారా తనకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా ఏదో విధంగా సర్దుబాటు చేయించి వీటిని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్లు చేయడంలో ముందున్న ఆర్థోపెడిక్ డాక్టర్లను అభినందించారు. పరికరాలను అందించడంలో ఈ విభాగానికి తొలి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు.
రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లు వెళ్లిపోతున్నారు
ఆస్పత్రిలో రక్త పరీక్షల రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లుండటం లేదని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ తెలిపారు. సిబ్బంది తక్కువవడంతో రక్త పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను సకాలంలో తీయడం లేదని.. అపాయింట్‌మెంట్ ఇచ్చి అప్పుడు రావాలంటున్నారని చెప్పారు. ఎమ్మారై, సీటీ స్కాన్ రిపోర్టులను రెండు, మూడు రోజులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఫిజియోథెరపీ విభాగంలో పది శాతం పరికరాలే ఉన్నాయని, ఇలాగైతే సేవలు ఎలా అందుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీఎమ్మెస్‌ఐడీసీ అధికారులు ఇటీవల రూ.13 లక్షలతో నిర్మించిన రేకుల గదులు ఉరుస్తున్నాయని తెలిపారు. లోపాలను సరిచేయాలని హాస్పిటల్ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు బ్రహ్మారెడ్డి, మల్లికార్జున, అబీదా సుల్తానా కోరారు. ఆస్పత్రిలోకి బయటి వ్యక్తులు గుంపులుగా రావడంతో పాటు ఎమర్జెన్సీ విభాగంలోకి వచ్చి వైద్యసేవలకు ఆటంకం కలిగిస్తున్నారని, వీటిని తక్షణమే అరికట్టేందుకు పోలీసులను ఉపయోగించాలని ఏఎస్పీ సౌజన్యను ఆదేశించారు. ఇలా బయటి వ్యక్తులు హల్‌చల్ చేస్తే సంబంధిత ఎస్సైపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
జాప్యం చేస్తే సహించేదిలేదు
ఆస్పత్రిలో రాత్రి పూట లైట్లను ఏర్పాటు చేయాలని ఏపీఎమ్మెస్‌ఐడీసీ అధికారులను ఆదేశించగా, ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని వారు చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే వేరే విభాగాలకు పంపుతానని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా బ్యాకప్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్తను తరలించడంలో ఇబ్బందులను తొలగించాలని ఎంహెచ్‌ఓకు సూచించారు. క్లినికల్, నాన్ క్లినికల్ సమస్యలపై సమీక్షించారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీసీహెచ్‌ఎస్ పరిమళ, ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, ఆర్డీఓ అనూష, ఏఎస్పీ సౌజన్య, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కళారాణి, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.


