● ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర ప్రారంభం
● తూర్పుకనుపూరు చేరుకున్న ఘటోత్సవం
చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. జాతర సందర్భంగా గ్రామాల్లో తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఘటోత్సవం ఐదు గ్రామా లు తిరిగి తూర్పుకనుపూరు చేరుకుంది. ఈదులవారిపాళెం, కొమరావారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాల్లో తిరిగిన అనంతరం తూర్పుకనుపూరుకు ఘటోత్సవం చేరుకుంది. పోలేరమ్మ ప్రతిమను కుమ్మరి ఇంట తయారు చేసి మెట్టినిల్లుగా ఉన్న చాకలి వారి ఇంటికి చేర్చారు. ఆ తర్వాత ఆలయ ప్రధానార్చకుడి ఇంట ఘటం కుండలు దిగాక దిష్టి తీర్పు తీర్చి గణాచారి ముందు నడుస్తుండగా, పోలేర మ్మ ప్రతిమను సప్పరంపై ఉంచి గంగమిట్టపై వేసిన తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీర్చారు. పూలంగిసేవలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవా న్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి వేయి కళ్ల దుత్తల తో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేశారు.


