● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అంతే లేకుండాపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన నాటకంలో సర్పంచ్ సుబ్బయ్య పాత్రను సోమిరెడ్డి వేయడంపై ‘సుబ్బయ్య‘ అని సంబోధిస్తూ సైటెర్లు వేశారు. ఆ నాటకం ద్వారా తనకు మంత్రి పదవి కావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆయన పరోక్షంగా చెప్పారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు దిగజారాయని ఆరోపించారు. జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. గుమ్మళ్లదిబ్బ ఘటనను మరువకముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరిగిందని, వీటిని దాచిపెట్టేందుకు పోలీసులు యత్నించడం దారుణమన్నారు. సస్పెండైన సీఐ, ఎస్సైపై ఉదాసీనతతో వ్యవహరించకుండా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేసిన ఇన్‌చార్జి సీఐను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద రూ.100 కోట్ల విలువైన భూమికి సోమిరెడ్డి ఎసరు పెట్టారని విమర్శించారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకెళ్లి, వారి ఇంటికి దూరంలో వివరాలను ప్రస్తావించకుండా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాననే కారణంతో తనపై కేసు నమోదు చేసి, తన కుమార్తెకు నోటీసులిచ్చారని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ తమ బాధ్యతలను పోలీసులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. వరిగొండలో బాలికపై జరిగిన ఘటనపై పెద్దాస్పత్రికి వెళ్లి తమ పార్టీ మహిళా నేతలు విచారిస్తే, ఆచూకీ తెలియనీయకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది యత్నించారని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ గీతాలక్ష్మి.. బాలిక విషయం తెలియదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని చెప్పారు. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాలికపై మత్తులో అఘాయిత్యానికి పాల్పడితే ఏ చర్యలు చేపట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కొత్త డ్రామాలకు తెరలేపి బాలిక కుటుంబాన్ని అదృశ్యం చేశారని మండిపడ్డారు. ఆ కుటుంబం ఎక్కడికెళ్లింది.. వారు క్షేమంగానే ఉన్నారాననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. రవినాయక్‌కు పోలీస్ శాఖలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. తమ పార్టీ నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టి, జైలు పాల్జేశారని.. చివరికి ఒక తప్పుడు కేసులో జడ్జి చీవాట్లు పెట్టారన్నారు. గతంలో ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణకాంత్ అసమర్థతతో జిల్లా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురికావొద్దని పోలీసులకు హితవు పలికారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న భూములకు సంబంధించి తహసీల్దార్ సంతకం చేయకపోవడంతో కొత్త వారిని నియమించుకున్నారని చెప్పారు. సోమిరెడ్డి అవినీతిపై బీజేపీ నేతలే మీడియా ఎదుట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయనంత అవినీతిపరుడు మరొకరు లేరని చెప్పారు. ఆయన బెదిరింపులకు తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు.


