● పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా
రోడ్డు నిర్మాణం
చిల్లకూరు: చిల్లకూరు – కోట మండల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిస్‌సిటీకి సంబంధించిన పనులను బుధవారం తీగపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. దీనికితోడు కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సేకరించిన భూములకు దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా 8 అడుగులకు పైగా రోడ్డును ఎత్తు చేస్తున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోవాలంటూ అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ భూములు సేకరించిన సమయంలో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో కూడా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారన్నారు. అయితే నేడు ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. వ్యవసాయం చేసుకోలేక, ఇటు పరిహారం అందక, పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. భూ సేకరణ సమయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పర్యటించి స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు క్రిస్‌సిటీ యాజమాన్యం రోడ్డుకు ఇరువైపులా పట్టా భూములున్న వాటిలోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం చూపించకుండా 8 అడుగుల ఎత్తుకు పైగా చేస్తుండడంతో భవిష్యత్‌లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్లు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స్పందించి పరిహారం త్వరగా అందించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బంది రైతులతో మాట్లాడి పనులు నిలిపివేయడంతో పాటు సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు.


