జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. టీడీపీ ప్రభుత్వం పునాది వేసి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు. 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొత్తంగా 16 ఏళ్ల రాజ్యాధికారంలో ఆ పార్టీ మార్కు అభివృద్ధి ఇది అని చెప్పే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. పునాది రాళ్లు కూడా వేయని ప్రాజెక్ట్‌లకు ఉద్యమంలా శిలాఫలకాలు వేయడం, గత ప్రభుత్వాలు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ల క్రెడిట్ చోరీ చేసి తమ ఖాతాలో వేసుకోవడం తప్ప.. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. ఈ జాబితాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు ఉండడం గమనార్హం. కనీసం డీపీఆర్‌లు, నిధుల కేటాయింపులు లేకుండానే ఏకంగా శిలాఫలకాలు వేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుండగా, తాజాగా ఆ జాబితాలో మంత్రి లోకేశ్ కూడా చేరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు
గాల్లో చక్కర్లు కొడుతున్న.. దగదర్తి ఎయిర్‌పోర్టు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే హార్బర్ నిర్మాణానికి పునాది, పూర్తి
● 72 ఎకరాల్లో
రూ.288.80 కోట్లతో నిర్మాణం
● 1,250 బోట్లు నిలిపే సామర్థ్యంతో ఏర్పాటు
● ఏటా 41,250 టన్నుల మత్స్యసంపద వెలికితీతే లక్ష్యం
● పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను అటకెక్కించిన
చంద్రబాబు సర్కారు
నేను జువ్వలదిన్నె హార్బర్‌ను కట్టేశా..!
నానారు.. ఎయిర్‌పోర్టును పూర్తి చేశా..!
జిల్లాలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రాజెక్ట్ ‘జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్’ ఒకటి. అపార మత్స్యసంపదకు నిలయమైన ఆంధ్రా తీరాన్ని వేటకు అనుకూలంగా మార్చి, ఎగుమతులకు అవకాశం కల్పి స్తే మత్స్యకారుల్లో వలసలను నివారించడంతో పాటు సాగర తీరాన్ని సుసంపన్నంగా మార్చాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 76.89 ఎకరాల్లో రూ.288.8 కోట్ల వ్యయంతో 2021 మార్చి 19న జువ్వలదిన్నె ఫిషింగ్‌హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కరోనా వంటి విపత్తు వచ్చినా.. అధిగమించి త్వరితగతిన పూర్తి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి జువ్వలదిన్నె హార్బర్ దాదాపుగా పూర్తయింది. దీన్ని అప్పట్లో వర్చువల్‌గా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ ఆఖరి నిమిషంలో తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది.
41,250 టన్నుల మత్స్యసంపదే లక్ష్యంగా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగుల దివ్వెగా మార్చిన జువ్వలదిన్నెను టీడీపీ ప్రభుత్వం చీకట్లు కమ్ముకునేలా చేసింది. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదను వెలికి తీయడంతోపాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్సకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 20 ఎకరాల్లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, ఐదు ఎకరాల్లో బోట్ల తయారీ యూనిట్‌తోపాటు సుమారు 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్క్‌ల నిర్మాణంపై దృష్టి సారించింది. తద్వారా మత్స్యకార మహిళలకు, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వలసలు పూర్తిగా నివారించాలని భావించింది. ఇప్పటి వరకు సరైన వేట, ఉపాధి అవకాశాలు లేక మత్స్యకారులు తమిళనాడు, పాండిచ్చేరి, ముంబై, గోవా వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేది.
1250 బోట్లకు బెర్త్‌లు ఏర్పాటు..
జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌లో ఏక కాలంలో 1250 బోట్లు నిలిపే విధంగా బెర్త్‌లను నిర్మించింది. ఇప్పటి వరకు తీరంలో పెద్దబోట్లు నిలిపే అవకాశం లేకపోవడంతోపాటు సముద్రంలో 25 నాటికల్ మైళ్లు దాటి వేట చేపట్టలేని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ అందులోబాటులోకి వస్తే.. ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి లేకుండా.. ఇక్కడి నుంచి వేటను సాగించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష లబ్ధి చేకూరుతుంది. యువతకు ఉపాధి లభిస్తుంది.
చంద్రబాబు చేసిందేమిటంటే..
జిల్లా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. నిర్మించాలనే ఆలోచనే చేయలేదు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు హడావుడిగా ఆర్భాటంగా వచ్చి శిలాఫలకం వేసి చేతులు దులుపుకొన్నారు. కనీసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి భూసేకరణ చేపట్టలేదు. నిర్మాణ అంచనా వ్యయంపై డీపీఆర్‌కు పెన్ను సైతం పెట్టలేదు. చివరగా పెట్టిన ఓటాన్ బడ్జెట్‌లో కూడా కనీసం కేటాయింపులు కూడా పెట్టలేదంటే.. ఈ ప్రాజెక్ట్‌పై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ చేపట్టి, డీపీఆర్ సిద్ధం చేసి, నిధులు కేటాయించి పనులు పరుగులు పెట్టించి పూర్తి చేస్తే.. ఎన్నికల నోటిఫికేషన్‌తో మత్స్యకారులకు అంకితం చేయలేకపోతే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గడిచిన 21 నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మత్స్యకారులంటే ఆయనకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
ఫిషింగ్ హార్బర్ కోసం సిద్ధం చేసిన భవనాలు
జువ్వలదిన్నెలో నిర్మాణం పూర్తయిన బెర్తు
2009 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కిసాన్‌సెజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కృష్ణపట్నం పోర్టు, కిసాన్ సెజ్‌కు ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లాలకు అందుబాటులో ఉండేలా దగదర్తి వద్ద జాతీయ రహదారికి పక్కనే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశా రు. ఈ మేరకు భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన అకాల మరణంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఈ ఎయిర్‌పోర్టును ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదిత భూ ములపై గద్దల్లా వాలిపోయి.. ప్రైవేట్ భూములతోపాటు పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూకుంభకోణానికి పాల్పడ్డారు. దీంతో ఎయిర్‌పోర్టును ఒక దశలో రద్దు చేసిన పరి స్థితి కూడా అప్పట్లో ఏర్పడింది. తర్వాత ప్రతిపక్షాల ఆందోళనలు, ఆరోపణల క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు ఎయిర్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ లేదు.. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే హడావుడిగా ఆర్భాటంగా వచ్చిన శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ ఎయిర్‌పోర్టు నిర్మాణం గాల్లోనే చక్కర్లు కొడుతుండడం గమనార్హం.


