ఇదేం పాడు పనులు ఆఫీసర్..?
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. అవినీతికే కాకుండా మహిళా ఉద్యోగులపై వేధింపులకూ అడ్డాగా మారింది. ఇక్కడ కొందరు అధికారుల తీరు జుగుప్సాకరంగా మారింది. తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులనే అంశాన్ని విస్మరించి లైంగిక వేధింపులకు పాల్పడి వారిని మానసికంగా వేధించి పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా ఓ మహిళా ఉద్యోగిని డివిజనల్ స్థాయి ఇంజినీరింగ్ అధికారి లైంగికంగా వేధించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె విలపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రాధేయపడి.. సారీ చెప్పించి
తనపై ఆఫీసర్ అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళా ఉద్యోగి బోరున విలపించారు. దీంతో సహచర ఉద్యోగులు ఆమెను ఓదార్చారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె యత్నించగా, ఇరిగేషన్ శాఖ అధికారులు బతిమాలి.. సదరు అధికారితో సారీ చెప్పించారని తెలుస్తోంది. ఆయన్ను కాపాడేందుకు యత్నించిన తోటి అధికారులు.. ఎందుకు బుద్ధి చెప్పలేకపోయారని చిరుద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు సదరు అధికారిని పిలిచి మందలించి.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారని తెలుస్తోంది.
ఆత్మకూరులోనూ ఇదే పంథా..
గతంలో ఆత్మకూరు సబ్ డివిజన్లో పనిచేసిన సదరు అధికారి.. మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేసిన ఘటనలున్నాయి. గతంలో ఇదే తరహాలో అక్కడ ముగ్గుర్ని లైంగికంగా వేధించి వారితో చెప్పు దెబ్బలు తిన్న ఉదంతాలూ ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో ఇదే విషయమై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయన్ను క్వాలిటీ కంట్రోల్ సెక్షన్‌కు బదిలీ చేశారు.
ఇరిగేషన్ కార్యాలయంలో మహిళా చిరుద్యోగికి లైంగిక వేధింపులు
గతంలోనూ ఇదే తీరు
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు
వెళ్తుండగా, కాళ్లబేరానికి వచ్చిన వైనం
జరిగిందిదీ..
నా దృష్టికొచ్చింది
మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన విషయం నా దృష్టికొచ్చింది. వెంటనే విచారణకు ఆదేశించా. పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఎంకై ్వరీ జరిపి శాఖాపరమైన చర్యలు చేపడతాం.
– దేశ్‌నాయక్, ఎస్‌ఈ,
ఇరిగేషన్ శాఖ, నెల్లూరు
నెల్లూరులోని ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ డివిజనల్ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరులో గల కార్యాలయంలో పనిచేయాల్సిన ఈయన సెంట్రల్ డివిజన్ ఆఫీస్‌లో నిత్యం తిష్ట వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇక్కడే పనిచేసే మహిళా ఉద్యోగిపై కన్నేసిన సదరు అధికారి ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవారు. పెద్ద సారు కావడంతో మానసికంగా వేదనకు గురవుతున్నా, విషయాన్ని ఆమె బయటకు చెప్పుకోలేకపోయారు. తాజాగా స్థానిక డివిజనల్ ఇంజినీరింగ్ అధికారి గదిలో పనిచేస్తుండగా, అక్కడికెళ్లిన అధికారి, వెంటనే తలుపునకు గడయపెట్టి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ఆమె కేకలేశారు. ఆపై కార్యాలయ ఉద్యోగులు వెంటనే తలుపులను గట్టిగా కొట్టడంతో సదరు అధికారి తెరిచి పరారయ్యేందుకు యత్నించారని తెలుస్తోంది.


