ధైర్యముంటే సీబీఐ విచారణ జరపండి | - | Sakshi
Sakshi News home page

ధైర్యముంటే సీబీఐ విచారణ జరపండి

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

ధైర్యముంటే సీబీఐ విచారణ జరపండి

ధైర్యముంటే సీబీఐ విచారణ జరపండి

కమీషన్లను దండుకున్న సోమిరెడ్డి

విజిలెన్స్‌ కార్యాలయంలో ఆయనకేమి పని

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తానెన్నో సార్లు సవాల్‌ విసిరానని, ధైర్యముంటే సీబీఐతో విచారణ జరిపిస్తే దొంగ ఎవరో తేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఇరిగేషన్‌ పనులపై ఇటీవలి కాలంలో తనపై సవాళ్లు విసురుతున్నారని, వీటిని తాను స్వీకరిస్తున్నానని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇరిగేషన్‌ శాఖను సోమిరెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, జరగకూడని ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించా రు. జిల్లాలో ఈ శాఖ అంటేనే నీచంగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్‌కు సంబంధించిన ప్రతి పనిలో కమీషన్లను ఆయన దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ఇరిగేషన్‌ పనుల జాబితా ప్రతి పేజీపై సంతకం చేసి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.100 కోట్లను దోచుకున్నారని తాము ఆరోపిస్తుంటే, వాటికి సమాధానం చెప్పకుండా రూ.19 కోట్లంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. కనుపూరు కాలువను పరిశీలించేందుకు తామొస్తామంటే భయపడి, హౌస్‌ అరెస్ట్‌ను ఎందుకు చేయించారని ప్రశ్నించారు.

బిడ్లు వేసినట్లు నిరూపించగలరా..?

కనుపూరు కాలవ షట్టర్‌ పనుల్లో అవినీతి జరిగిందంటున్నారని, ఇందులో తమ పార్టీకి సంబంధించిన ఏ కాంట్రాక్టరైనా బిడ్లు వేసినట్లు నిరూపించగలరానని ప్రశ్నించారు. షట్టర్‌ పనులు చేసే కాంట్రాక్టర్‌ను రూ.10 కోట్లను సోమిరెడ్డి డిమాండ్‌ చేశారని, అయితే అంత ఇచ్చుకోలేని ఆయన చెప్పడంతో అవినీతి జరిగిందంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిద్రలేచినప్పటి నుంచి విజిలెన్స్‌ డీజీపీ ఆఫీస్‌లో సోమిరెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తమ హయాంలో విజిలెన్స్‌ ఆఫీసర్‌తో తాను లేక తన మనుషులు మాట్లాడినట్లు రుజువు చేయగలరానన్నారు.

తమ హయాంలో అంతా సక్రమంగా..

తమ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్రమపద్ధతిలో ఉంచారని తెలిపారు. పొదలకూరు వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించినందుకు గానూ అవార్డులొచ్చాయని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పొదలకూరు ఆస్పత్రి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డులను మూడుసార్లు దక్కించుకుందని గుర్తుచేశారు.

ఎఫ్డీఆర్‌ పేరిట దొంగ బిల్లులు

ఎఫ్డీఆర్‌ పనుల పేరిట దొంగ బిల్లులు చేసుకొని దోచుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నీరొదిలాక ఈ పనులను ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ ఆఫీస్‌లో మేనేజర్‌గా ఉన్న గంగాధర్‌రెడ్డి అవినీతి వ్యవహారంపై తాను ఆధారాలతో సహా ఇటీవల బహిర్గతం చేశానని తెలిపారు. అవినీతి ఎలా చేయాలో సోమిరెడ్డి వద్ద గంగాధర్‌రెడ్డి ట్రెయినింగ్‌ తీసుకొని, వాటినే ఇప్పుడు చెప్తున్నారని విమర్శించారు. నిజంగా గంగాధర్‌రెడ్డి కుమారుడి ఖాతాలో పడాల్సిన డబ్బులు ఆయనకు పడితే సర్వీస్‌ రూల్స్‌ మేరకు ఇప్పటికే వివరణిచ్చి ఉండాలని చెప్పారు. తన ఇంటిని కరోనా హౌస్‌ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, ఆ సమయంలో తానెలాంటి పనులు చేశానో.. ఎవరికి ఎంత సాయం చేశానో.. ఎంత ఖర్చు పెట్టానో సర్వేపల్లి ప్రజలు, ఆ భగవంతుడికి తెలుసునన్నారు. సర్వేపల్లి, అల్లీపురంలో గృహాలను ఆయన ఎలా కట్టారో తాను చెప్తే అవమాన భారాన్ని తట్టుకోలేరని చెప్పారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గొలగమూడి, కసుమూరులో డైమండ్‌ డబ్బాను ఆడిస్తున్నారని విమర్శించారు. గ్రావెల్‌, ఇసుక, మట్టి అనే తేడా లేకుండా ప్రతి అంశంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement