జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి | - | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

జగన్‌

జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి

నెల్లూరు రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డైరీ, క్యాలెండర్లను జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

20న జెడ్పీ స్థాయీ

సంఘ సమావేశాలు

నెల్లూరు(పొగతోట): నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 20న నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాలను ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్నామని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. క్యూ నారాయణగిరి షెడ్‌ వద్దకు చేరుకుంది. స్వామివారిని 88,752 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,443 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.69 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ నేడు

నెల్లూరు (లీగల్‌): న్యాయవాదులకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కోర్టు విధులను శుక్రవారం బహిష్కరించనున్నామని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, జల్లి పద్మాకర్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజయాదవ్‌ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ అంశాలను పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టనున్న విధుల బహిష్కరణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.

జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో సత్తా

కోట: జాతీయ స్థాయి మట్టి కుస్తీ పోటీల్లో స్థానిక ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వీరిని గురువారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఈ నెల మూడు నుంచి నిర్వహించిన పోటీల్లో అండర్‌ – 14 విభాగంలో ఏడో తరగతి విద్యార్థి నాగసాయి స్వర్ణ.. సాయినిఖిల్‌ కాంస్య పతకాలను సాధించారని వివరించారు. యోగానంద్‌ ఉత్తమ ప్రతిభ చూపారని తెలిపారు. పీడీ రాజ్‌కుమార్‌కు అభినందనలను తెలియజేశారు.

కండలేరు వరద

కాలువలో మృతదేహం

కలువాయి (సైదాపురం): కలువాయి మండలంలోని దాసరపల్లి సమీపంలో గల కండలేరు వరద కాలువ బ్రిడ్జి వద్దకు ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై కోటయ్య, సిబ్బంది చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి 1
1/1

జగన్‌ను కలిసిన పర్వతరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement