జ్వెరెవ్, సినెర్‌ మూడో రౌండ్లోకి... | Zverev and Siner advance to third round at French Open | Sakshi
Sakshi News home page

జ్వెరెవ్, సినెర్‌ మూడో రౌండ్లోకి...

May 30 2025 2:17 AM | Updated on May 30 2025 2:17 AM

Zverev and Siner advance to third round at French Open

మహిళల్లో గాఫ్, పెగూలా ముందంజ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ స్టార్లు, సీడెడ్‌ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు యానిక్‌ సినెర్‌ (ఇటలీ), మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) వరుస సెట్లలో ప్రత్యర్థులపై గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా), మూడో సీడ్‌ పెగూలా (అమెరికా), ఆరో సీడ్‌ అండ్రీవా (రష్యా), ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)లు కూడా అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి చేరుకున్నారు.  

టైటిలే లక్ష్యంగా... 
హార్డ్‌ కోర్టుల్లో (ఆ్రస్టేలియా ఓపెన్‌లో 2, యూఎస్‌ ఓపెన్‌లో 1) మూడు టైటిల్స్‌ సాధించిన టాప్‌సీడ్‌ ప్లేయర్‌ సినెర్‌ ఈసారి క్లే కోర్టు టైటిలే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఇటలీకి చెందిన నిరుటి సెమీఫైనలిస్ట్‌ సినెర్‌  6–3, 6–0, 6–4తో రిచర్డ్‌ గాస్కెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. కేవలం రెండు గంటల్లోపే (1: 57 నిమిషాలు) వరుస సెట్లలో ప్రత్యర్థి ఆటకట్టించాడు. ప్రత్యర్థిపై మూడు ఏస్‌లు సంధించిన సినెర్‌ ఒక్క డబుల్‌ఫాల్ట్‌ కూడా చేయలేదు. 

21 విన్నర్లు కొట్టిన సినెర్‌ ఫ్రాన్స్‌ ఆటగాడిపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించాడు. గత ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్, మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 3–6, 6–1, 6–2, 6–3తో జెస్పెర్‌ డి జోంగ్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు. తొలిసెట్‌ను కోల్పోయిన జర్మనీ స్టార్‌ తర్వాత వరుస సెట్లలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పట్టుదలగా ఆడి గెలుపొందాడు.  17వ సీడ్‌ అండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) 7–6 (7/1), 6–1, 7–6 (7/5)తో  ఆడమ్‌ వాల్టన్‌ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా, తొమ్మిదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. 

గత ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ డిమినార్‌ 6–2, 6–2, 4–6, 3–6, 2–6తో అనామక కజకిస్తాన్‌ ప్లేయర్‌ బబ్లిక్‌ చేతిలో కంగుతిన్నాడు.  సెర్బియన్‌ స్టార్, ఆరోసీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 6–3, 6–2, 7–6 (7/1)తో మౌటెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొంది మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.   

గాఫ్, అండ్రీవాల జోరు 
మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో రెండో సీడ్‌ కొకొ గాఫ్, ఆరో సీడ్‌ అండ్రీవా తమ ప్రత్యర్థుల్ని చాలా సులువుగా చిత్తు చేశారు. గాఫ్‌ (అమెరికా) 6–2, 6–4తో వాలెంతొవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గంటా 15 నిమిషాల్లోనే గెలుపొందగా, అండ్రీవా 6–3, 6–4తో క్రూగెర్‌ (అమెరికా)ను గంటా 13 నిమిషాల్లోనే చిత్తు చేసింది. మూడో సీడ్‌ పెగూలా (అమెరికా) 6–3, 7–6 (7/3) అన్‌ లీ (అమెరికా)పై, ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–1, 6–3తో బౌల్టెర్‌ (ఇంగ్లండ్‌)పై విజయం సాధించారు. పదో సీడ్‌ బడొసా (స్పెయిన్‌) 3–6, 6–4, 6–4తో ఎలీనా గాబ్రియెలా రూస్‌ (రొమేనియా)పై గెలిచింది.  

శ్రీరామ్‌ బాలాజీ జోడీ కూడా... 
పురుషుల డబుల్స్‌లో మరో భారత జోడీ కూడా ముందంజ వేసింది. మెక్సికో ఆటగాడు మిగుల్‌ రేస్‌ వరెలాతో జతకట్టిన శ్రీరామ్‌ బాలాజీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ తొలిరౌండ్‌ పోరులో బాలాజీ–మిగుల్‌ రేస్‌ జోడీ 6–2, 6–1తో యుంచవొకెత్‌ బూ (చైనా)–యుగొ కారబెలి (అర్జెంటీనా) జంటపై వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement