పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ | Yuki and Olivetti pair lost in Swiss Indoors Open | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ

Oct 26 2024 4:02 AM | Updated on Oct 26 2024 4:02 AM

Yuki and Olivetti pair lost in Swiss Indoors Open

బాసెల్‌: స్విస్‌ ఇండోర్స్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే (బ్రిటన్‌)–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోల (రూ. 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

తొలి రౌండ్‌లో మొత్తం ఏడు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)–జో సాలిస్‌బరీ (బ్రిటన్‌) జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్‌ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. 93 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 14 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. 

నిర్ణాయక ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మాత్రం అపార అనుభవజు్ఞలైన జేమీ ముర్రే–జాన్‌ పీర్స్‌ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. డబుల్స్‌లో  ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అయిన 38 ఏళ్ల జేమీ ముర్రే మొత్తం 32 టైటిల్స్‌ సాధించాడు. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌) కూడా ఉన్నాయి. 

36 ఏళ్ల జాన్‌ పీర్స్‌ ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో సహచరుడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కెరీర్‌ మొత్తంలో 28 డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జాన్‌ పీర్స్‌ 2017లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు.   

Advertisement
 
Advertisement
Advertisement