WTC Final: సచిన్‌, ద్రవిడ్‌ రికార్డులకు ఎసరు పెట్టిన కోహ్లి

WTC Final: Virat Kohli Eyes On Breaking Sachin, Dravid Records - Sakshi

ఓవల్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి (జూన్‌ 7) ప్రారంభం కాబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో పలు రికార్డులను బద్దలు కొట్టేందుకు టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెడీ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి.. సచిన్‌, ద్రవిడ్‌ రికార్డులకు ఎసరు పెట్టాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో 2 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో 639 పరుగులు చేసిన కోహ్లి.. అదే ఫామ్‌ను కంటిన్యూ చేసి శతక్కొడితే దిగ్గజ క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సమం చేస్తాడు.

బ్రాడ్‌మన్‌ రికార్డు..
టెస్ట్‌ల్లో  డాన్‌ బ్రాడ్‌మన్‌ 29 శతకాలు చేయగా.. ప్రస్తుతం కోహ్లి పేరిట 28 సెంచరీలు ఉన్నాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లి సెంచరీ చేస్తే.. బ్రాడ్‌మన్‌ 29 సెంచరీల రికార్డును సమం చేస్తాడు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారిలో జో రూట్‌ 30 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ 29 సెంచరీలతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. వీరి తర్వాత కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. 

ద్రవిడ్‌ రికార్డు..
టెస్ట్‌ల్లో ఆసీస్‌పై మూడో అత్యధిక పరుగులు (2166) సాధించిన ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట రికార్డు ఉంది. ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ (3630), లక్ష్మణ్‌ (2434) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌తో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 1979 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లి మరో 188 పరుగులు చేస్తే.. ద్రవిడ్‌ రికార్డును బద్దలు కొట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు.

సచిన్‌ రికార్డు..
ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్‌ (657) పేరిట ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లి మరో 37 పరుగులు చేస్తే సచిన్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది. 

చదవండి: ఐపీఎల్‌లో వచ్చే డబ్బు కంటే ఆస్ట్రేలియాకు 100 టెస్ట్‌లు ఆడటమే ముఖ్యం..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top