
మహిళల ఆసియాకప్-2024లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్(10) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది.
ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు.