న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ గడ్డపై తొలి దైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసమైంది.
గత పర్యటనలో టెస్టుల్లో భారత్‌ను వైట్‌వాష్ చేసిన కివీస్.. ఈసారి వన్డేల్లో మట్టి కరిపించింది. చివరి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(124) ఒంటరి పోరాటం చేశాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రోహిత్, గిల్,శ్రేయస్ అయ్యర్ వంటి టాపార్డర్ బ్యాటర్ల నుంచి సహకరం లభించకపోవడంతో 296 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ స్పందించాడు. భారత్‌పై సిరీస్ విజయం తమకెంతో ప్రత్యేకమని బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు.
"భారత్‌కు వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాం. టీమిండియా వంటి పటిష్టమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించి, తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము ఎప్పటకీ మర్చిపోము. భారత్‌కు వచ్చి మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రతీ జట్టు కోరుకుంటుంది.
మేము ఒక జట్టుగా మా ప్రణాళికలకు కట్టుబడి, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. అది మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఒక మూలన ఉన్న చిన్న దేశం నుంచి వచ్చిన మేము.. ఐక్యంగా ఉండి పెద్ద పెద్ద జట్లను సవాల్ విసురుతున్నాము. కలిసి కట్టుగా ఆడడం ఒక్కటే న్యూజిలాండ్ క్రికెట్ సిద్ధాంతం.
ఇక డారిల్ మిచెల్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా వన్డేల్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. అతడు మాకు మిడిలార్డర్‌లో కీలకమైన ఆటగాడు. మిచెల్ మా బ్యాటింగ్ యూనిట్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్ ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాము. భారత్ వంటి కఠిన పరిస్థితులలో వారి ఆట తీరు చూస్తుంటే కివీస్ క్రికెట్ భవిష్యత్తుపై ఎటువంటి ఢోకా లేదన్పిస్తోందని" బ్రేస్‌వేల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే?


