
ఐపీఎల్(IPL) రాగానే ఎమ్మెస్ ధోనికి(MS Dhoni) ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్‌లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు.
తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.