WI vs SA: విండీస్‌తో సిరీస్‌.. సంచలన ఆటగాడి ఎంట్రీ | SA Vs WI Test Series: South Africa Announced Test 16-Member Squad Against West Indies | Sakshi
Sakshi News home page

WI vs SA: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. సంచలన ఆటగాడికి తొలి పిలుపు

Jul 8 2024 3:30 PM | Updated on Jul 8 2024 3:55 PM

WI vs SA Test Series Jansen Rested Breeze Gets Maiden Call Up 16 Member Squad

మాథ్యూ బ్రి‍ట్జ్కే (PC: Cricket South Africa)

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధం కానుంది. విండీస్‌ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.

తొలిసారి జాతీయ జట్టులో
ఈ క్రమంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపిన 25 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కేకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.

అదే విధంగా.. వికెట్‌ కీపర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ కూడా ఈ సిరీస్‌ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. కాగా తెంబా బవుమా కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడనున్న ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ దూరం కానున్నాడు.

నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్న ఈ పేసర్‌కు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌ కోచ్‌ షుక్రి కొన్రాడ్‌ మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో బిజీగా ఉన్న మేము.. తిరిగి టెస్టు క్రికెట్‌తో బిజీ కానున్నాము.

ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే కరేబియన్‌ జట్టుతో పోరుకు పటిష్ట జట్టును ఎంపిక చేశాం.

డొమెస్టిక్‌ క్రికెట్‌లో అదరగొట్టి
దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన మాథ్యూకు ఈసారి చోటిచ్చాం. మార్కో జాన్సెన్‌కు విశ్రాంతి అవసరమని భావించాం’’ అని తెలిపాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్‌ క్రికెట్‌ గత సీజన్‌లో మాథ్యూ బ్రీట్జ్కే 322 పరుగులు సాధించాడు. ఇండియా-ఏ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ఆడాడు.

కాగా ఆగష్టు 7 నుంచి వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. కరేబియన్‌ దీవుల్లోని ట్రినిడాడ్‌, టొబాగో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఇక ఇదే వెస్టిండీస్‌ గడ్డపై ఇటీవల సౌతాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెరెన్నే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement