ఢిల్లీ స్టార్ బ్యాటర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.
అయితే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు. స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్‌గా మరొక స్పిన్ అప్షన్(బదోని) ఉంటే బెటర్ అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.
బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..
అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్‌మెంట్, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది.
ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.
క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఐపీఎల్‌లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్‌రౌండర్‌గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్‌కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.
పంత్ స్దానంలో జురెల్..
అదేవిధగా కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.
చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్


