‘అతడి డబుల్‌ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపు’ | When He Scored 200 I Knew This Is The End Of My Career: Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

అతడి డబుల్‌ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపు: భారత మాజీ ఓపెనర్‌

Jul 2 2025 2:05 PM | Updated on Jul 2 2025 4:02 PM

When He Scored 200 I Knew This Is The End Of My Career: Shikhar Dhawan

టీమిండియా ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ లెఫ్టాండర్‌.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్‌లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్‌ 6793 పరుగులు సాధించాడు.

అయితే, నయా స్టార్లు శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్‌ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్‌ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.

ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్‌ ధావన్‌.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అతడి డబుల్‌ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపు
తాజాగా ఈ విషయాల గురించి శిఖర్‌ ధావన్‌ స్పందించాడు. బంగ్లాదేశ్‌ మీద ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ బాదినపుడే తన కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.

వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్‌ కిషన్‌ బంగ్లాదేశ్‌తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.

ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్‌ ధావన్‌ పేర్కొన్నాడు. 

కాగా డబుల్‌ సెంచరీ వీరుడు ఇషాన్‌ కిషన్‌ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్‌ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్‌ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా  టెస్టు కెప్టెన్‌గా ఎదిగాడు.

ఒక్కరూ మాట్లాడలేదు
ఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్‌ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.

అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్‌ భాయ్‌ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్‌ చేశారు’’ అని ధావన్‌ తెలిపాడు. కాగా శిఖర్‌ ధావన్‌ ప్రస్తుతం లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో, లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లోనూ అతడు భాగమవుతున్నాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్‌.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement