‘అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్‌ బ్యాటర్‌’ | What An Occasion To Make Debut: Australia Great On Konstas Call Up For India Test | Sakshi
Sakshi News home page

అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్‌ బ్యాటర్‌: ఆసీస్‌ దిగ్గజం

Dec 21 2024 4:59 PM | Updated on Dec 21 2024 5:24 PM

What An Occasion To Make Debut: Australia Great On Konstas Call Up For India Test

యువ సంచలనం సామ్‌ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ మైక్‌ హస్సీ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ అతడు బ్యాటింగ్‌ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. ఇక టీమిండియా వంటి పటిష్ట జట్టుపై ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌తో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఓడిపోయిన కంగారూలు.. అడిలైడ్‌లో గెలుపొందారు. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేశారు. అయితే, ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. ఈ క్రమంలో భారత్‌- ఆసీస్‌ మధ్య మెల్‌బోర్న్‌లో నాలుగు, సిడ్నీలో ఐదో టెస్టు జరుగనున్నాయి.

కొత్త కుర్రాడికి చోటు
ఇందుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టును ప్రకటించింది. పెర్త్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీని తప్పించి.. సామ్‌ కొన్‌స్టాస్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఒకవేళ డిసెంబరు 26 నుంచి జరిగే ‘బాక్సింగ్‌ టెస్టు’ (నాలుగో మ్యాచ్‌)లో తుది జట్టు తరఫున కొత్త కుర్రాడు బరిలోకి దిగితే చరిత్రే.

వారిద్దరి తర్వాత
డెబ్బై ఏళ్ల తర్వాత.. అంతర్జాతీయ టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్‌ టీనేజ్‌ బ్యాటర్‌గా కొన్‌స్టాస్‌ ఘనత వహిస్తాడు. 1953లో ఇయాన్‌ క్రెయిగ్‌ 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ తరఫున స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా అరంగేట్రం చేశాడు. 

అయితే 2011లో ప్యాట్‌ కమిన్స్‌ (ప్రస్తుత కెప్టెన్‌) 18 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పటికీ అతను స్పెషలిస్టు బౌలర్‌(పేసర్‌)!

ఈ నేపథ్యంలో మైక్‌ హస్సీ ఫాక్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘మెక్‌స్వీనీ పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించారన్న మాట వాస్తవం. అతడిపై నాకు సానుభూతి ఉంది. అయితే, కొన్‌స్టాస్‌ తక్కువేమీ కాదు. బిగ్‌బాష్‌ లీగ్‌లో అతడి ఆట నన్ను ఆకట్టుకుంది.

ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు
అద్భుతమైన సందర్భంలో కొన్‌స్టాస్‌ అరంగేట్రం చేయబోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే టీమిండియా మీద.. అది కూడా బాక్సింగ్‌ డే టెస్టులో ఓపెనింగ్‌ బ్యాటర్‌గా అవకాశం. వావ్‌.. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’’ అని కొన్‌స్టాస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

కాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలతో పాటు ఆసీస్‌ ‘ఎ’, బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లలో కొన్‌స్టాస్‌ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్‌ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అజేయ అర్ధ శత‍కం (73 నాటౌట్‌) బాదాడు కొన్‌స్టాస్‌.

అదే విధంగా.. అడిలైడ్‌లో డే-నైట్‌ టెస్టుకు ముందు భారత్‌తో జరిగిన సన్నాహక పింక్‌ బాల్‌ (రెండు రోజుల మ్యాచ్‌) పోరులో ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌ తరఫున శతకం (107) సాధించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్ర బ్యాటర్‌.. శనివారం సిడ్నీ సిక్సర్‌తో మ్యాచ్‌ పూర్తయ్యాక  ఆసీస్‌ టెస్టు జట్టుతో కలుస్తాడు.

చదవండి: BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement