Sakshi News home page

WC 2023: 4 ఏళ్లుగా ఫుడ్‌ డెలివరీ చేస్తున్నా! ఇప్పుడిలా వరల్డ్‌కప్‌ జట్టుకు: చెన్నై క్రికెటర్‌ భావోద్వేగం

Published Thu, Sep 21 2023 7:49 PM

WC 2023: From Food Delivery Boy To Netherlands Net Bowler Lokesh Kumar - Sakshi

ICC ODI World Cup 2023: ‘‘నా కెరీర్‌లో అత్యంత విలువైన క్షణాలు ఇవే. నేనింత వరకు కనీసం..  తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ థర్డ్‌ డివిజన్‌ లీగ్‌లో కూడా ఆడలేదు. నాలుగేళ్లపాటు ఐదో డివిజన్‌లో ఆడాడు. ఈసారి నాలుగో డివిజన్‌లో ఆడేందుకు రిజిస్టర్‌ చేసుకున్నాను.

నెదర్లాండ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలియగానే.. ఎట్టకేలకు నా ప్రతిభను గుర్తించే వాళ్లు కూడా ఉన్నారనే భావన కలిగింది’’ అని తమిళనాడుకు చెందిన లోకేశ్‌ కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన లోకేశ్‌కు క్రికెటర్‌గా ఎదగాలని ఆశయం.

వేలాది మందిలో నలుగురు.. అందులో ఒక్కడు
ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడతడు. అయితే, కాలక్రమంలో చైనామన్‌ స్పిన్నర్‌గా మారాడు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటున్న లోకేశ్‌కు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాలనేది చిరకాల కోరిక. అక్కడ ప్రతిభ నిరూపించుకుంటే.. అదృష్టం కలిసివస్తే ఏదో ఒకరోజు టీమిండియాకు కూడా ఆడొచ్చనే ఆశ.

ఈ క్రమంలో.. వన్డే వరల్డ్‌కప్‌-2023 ప్రాక్టీసులో భాగంగా తమకు భారత నెట్‌ బౌలర్లు కావాలని నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ప్రకటన అతడిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో తన అర్హతలను జోడిస్తూ అప్లికేషన్‌ పెట్టుకోగా.. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా ఎంపికయ్యాడు.

ఆటగాళ్లకు పరిచయం చేస్తూ
హైదరాబాదీ రాజమణి ప్రసాద్‌, రాజస్తాన్‌ హైకోర్టు ఉద్యోగి హేమంత్‌ కుమార్‌, హర్యానాకు చెందిన హర్ష్‌ శర్మలతో పాటు నెదర్లాండ్స్‌ క్యాంపులో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మొదటి ట్రెయినింగ్‌ సెషన్‌లో భాగంగా.. ఈ నలుగురిని తమ ఆటగాళ్లకు పరిచయం చేసింది మేనేజ్‌మెంట్‌.

కాగా పొట్టకూటి కోసం లోకేశ్‌ కుమార్‌ స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ ఇచ్చిన ఆఫర్‌ గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ..

ఆత్మీయ స్వాగతం పలికారు.. డచ్‌ ఫ్యామిలీలో ఒకడినని
‘‘నెదర్లాండ్స్‌ జట్టు సభ్యులు నన్ను తమలో ఒకడిగా భావించి ఆత్మీయ స్వాగతం పలికారు. నెట్‌ బౌలర్ల పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు.. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని మమ్మల్ని ప్రోత్సహించారు. 

నాకైతే ఇప్పుడే డచ్‌ ఫ్యామిలీలో సభ్యుడినయ్యానన్న భావన కలిగింది’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘కాలేజీ చదువు తర్వాత నా దృష్టి మొత్తం క్రికెట్‌ మీదే పెట్టాను. నాలుగేళ్లపాటు మొత్తం అంతా క్రికెట్‌ కోసమే.

అయితే, 2018లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాను. గత నాలుగేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. అలా నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటున్నాను. ఇది తప్ప నాకు మరో ఆదాయ వనరు లేదు. వీకెండ్స్‌లో మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి వీక్‌డేస్‌లోనే పనిచేస్తాను’’ అంటూ తన ఆర్థిక స్థితి గురించి లోకేశ్‌ చెప్పుకొచ్చాడు.

నెదర్లాండ్స్‌ క్రికెట్‌పై నెటిజన్ల ప్రశంసలు
కాగా ఐదోసారి వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్‌ జట్టు.. ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో ట్రెయినింగ్‌ క్యాంపు నిర్వహిస్తోంది. మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డచ్‌ టీమ్‌.. సెప్టెంబరు 29న పాకిస్తాన్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

ఈ క్రమంలో భారత నెట్‌ బౌలర్లను నియమించుకుని కావాల్సినంత ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ లాంటి ఆశావహులకు ఛాన్స్‌ ఇచ్చిన నెదర్లాండ్స్‌ మేనేజ్‌మెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా నెట్‌ బౌలర్‌కే ఇంత హైప్‌ అవసరమా అంటే..  కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి ఆటగాళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవచ్చు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నెట్‌ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రతిభ నిరూపించుకుని టీమిండియాకు ఎంపికై సత్తా చాటిన అతడు లోకేశ్‌ లాంటి వాళ్లకు ఆదర్శం.

చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్‌.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్‌ రైనా

Advertisement

తప్పక చదవండి

Advertisement