
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత బృందంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఉన్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు.
ఐపీఎల్-2025 సీజన్ తర్వాత లండన్‌లో ఉన్న కోహ్లి ఇటీవలే భారత్‌కు వచ్చాడు. అయితే ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి గురుగ్రామ్ ప్రాపర్టీని తన సోదరుడు వికాస్ పేరుకు బదిలీ చేసినట్టు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
37 ఏళ్ల విరాట్ ఇటీవలే తన ఆస్తి సంబంధిత పనుల కోసం గురుగ్రామ్‌లోని వజీరాబాద్ తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. దైనిక్ భాస్కర్’ నివేదిక ప్రకారం.. అతడు గురుగ్రామ్‌లో ఉన్న తన ఇంటికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)ని వికాస్ కోహ్లి పేరిట నమోదు చేసినట్లు సమాచారం.
ఒక వ్యక్తి తన ప్రాపర్టీకి చెందిన ఆర్థిక, చట్టపరమైన, వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొకరికి అధికారం కల్పించడాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు.
కాగా కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ పేరిట గురుగ్రామ్‌లోని DLF ఫేజ్–1 ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఒకటి ఉంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ.80 కోట్లు పైమాటే. సుమారు 10,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఆ విల్లా.. అద్భుతమైన ఇంటీరియర్స్, వుడ్‌వర్క్, స్విమ్మింగ్ పూల్, బార్ వంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది.
చదవండి: IND vs AUS: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపాన్ని అక్కడ చూపించేస్తున్నాడు