టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్‌ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారుతుంది.
కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు.
ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్‌ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం వెనుక భారత క్రికెట్‌లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్ నడిచింది.
సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు.
గత కొంతకాలంగా భారత్ టెస్ట్‌ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్‌ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్‌లో చేరతాడు.
కోహ్లి టెస్ట్ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్‌ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం.
శారీకంగా అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మెంటల్ ఫిట్‌నెస్ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్ చేస్తే, అతని ఫోకస్ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్ టర్మ్ ప్లానింగ్‌ను డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


