
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్‌గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.
2011 వెస్టిండీస్ (జూన్‌లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.
కోహ్లి టెస్ట్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్‌కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
టీమిండియా టెస్ట్‌ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్‌గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 మ్యాచ్‌లు గెలిచింది.
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరింది.
భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ సాధించిన పలు ఘనతలు
- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)
- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్‌లు) (భారత కెప్టెన్లలో)
- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్‌లు)
- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్‌లు)
- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)
- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు)
- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్‌లు)
- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం
- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్‌గా ఉండింది.