'కోహ్లిని ముందే హెచ్చ‌రించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు' | Virat Kohli Bailed Out Of The Challenging England Tour, Says Former England Spinner Monty Panesar | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'కోహ్లిని ముందే హెచ్చ‌రించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'

Jun 1 2025 11:35 AM | Updated on Jun 1 2025 2:19 PM

Virat Kohli bailed out of the challenging England tour: Monty Panesar

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ఆక‌స్మిక టెస్టు రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్  మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తం ఆడేందుకు త‌న‌కు అవకాశ‌మివ్వ‌మ‌ని సెల‌క్ట‌ర్లు చెప్ప‌డంతోనే కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడ‌ని ప‌నేస‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టు సిరీస్  జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. 

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో భార‌త కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక‌య్యాడు. టెస్టు జట్టులో యువ ఆట‌గాళ్లు సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి చోటు ద‌క్కించుకున్నారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్లు లేకుండా యువ భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలో గిల్ సేన‌ ఇంగ్లండ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో ఎలా రాణిస్తుందో అని అంద‌రూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

"ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు విరాట్ కోహ్లి వ‌స్తాడ‌ని నేను అనుకున్నాను. ఇంగ్లండ్ జ‌ట్టు స‌భ్యులు కూడా కోహ్లి ఆడుతాడ‌ని ఆశించారు. కానీ కోహ్లి స‌డ‌న్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంగ్లండ్ వంటి క‌ఠిన సిరీస్ నుంచి కోహ్లి కావాల‌నే బ‌య‌ట‌పడ్డాడ‌ని అన్పిస్తోంది.

ఎందుకంటే గ‌త కొన్నేళ్ల‌గా వైడ్ ఆప్ స్టంప్ స‌మస్య‌ను కోహ్లి అధిగ‌మించలేక‌పోతున్నాడు. టెస్టు క్రికెట్‌లో ప‌దేప‌దే అదే బంతుల‌కు కోహ్లి ఔట్ అవుతున్నాడు. బహుశా ఇది అత‌డి మైండ్‌లో ఉండ‌వ‌చ్చు. అదేవిధంగా సెల‌క్ట‌ర్లు కూడా కోహ్లితో ఓ విష‌యం చ‌ర్చించి ఉంటారు అని అనుకుంటున్నాను. 

తొలి రెండు టెస్టుల్లో బాగా రాణించ‌క‌పోతే, మిగిలిన మూడు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తుంద‌ని సెల‌క్ట‌ర్లు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోంచాకే కోహ్లి త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు" అని హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: బీసీసీఐ చైర్మెన్‌గా రాజీవ్ శుక్లా..?

Advertisement
 
Advertisement
Advertisement