
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) మైదానంలో దిగి చాన్నాళ్లే అయింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) ఫైనల్లో భాగంగా కోహ్లి చివరగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టైటిల్ పోరులో ఒకే ఒక్క పరుగు చేశాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడాల్సి ఉండగా.. కోహ్లి ఊహించని రీతిలో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక అంతకుముందే అంటే.. గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
ఇక ఆట నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ (Akaay)లతో కలిసి లండన్‌లో ఉన్న కోహ్లి.. చాలా రోజుల తర్వాత తన వ్యక్తిగత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఇలా..’’ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ పోస్టుకు ఇప్పటికే తొమ్మిదిన్నర మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. విరాట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌తో రీఎంట్రీ
ఐపీఎల్-2025 తర్వాత కోహ్లి.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్‌తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లి ఆడనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జిమ్‌లో చెమటోడుస్తున్న ఈ రన్‌మెషీన్.. పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.
కాగా ఈ ఏడాది కోహ్లి చిరకాల కోరిక నెరవేరిన విషయం తెలిసిందే. పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అతడు ముద్దాడాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఇప్పటిదాకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్