
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వేద ఇవాళ (జులై 25) సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన వేద 2011లో టీమిండియా అరంగేట్రం చేసింది.
అప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినథ్యం వహించి 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1704 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. వేద భారత మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచిన 2017 వన్డే వరల్డ్‌కప్, 2020 టీ20 వరల్డ్‌కప్ జట్లలో సభ్యురాలిగా ఉంది.
కర్ణాటకలోని కడూర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన వేద టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక సభ్యురాలిగా ఉంది. వేద తన రిటైర్మెంట్ సందేశంలో తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కోచ్‌లు, మెంటర్లు, సహచర క్రికెటర్లు, కెప్టెన్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తనకు అవకాశమిచ్చిన బీసీసీఐ, కర్ణాటక క్రికెట్ బోర్డు, రైల్వేస్ క్రికెట్ బోర్డుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.
వేద దేశవాలీ క్రికెట్‌లో కర్ణాటక, రైల్వేస్ జట్లకు నాయకత్వం వహించింది. వేద చివరిగా 2020 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. అంతకు రెండేళ్ల ముందు (ఏప్రిల్, 2018) భారత్ తరఫున తన చివరి వన్డే ఆడింది. వేదకు అత్యంత చురుకైన ఫీల్డర్‌గా పేరుంది. మహిళల టీ20ల్లో ఆమె సంయుక్తంగా అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్‌కీపర్‌గా కొనసాగుతుంది.
గత కొంతకాలంగా జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో వేద వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వేద మహిళల ఐపీఎల్ రెండో సీజన్‌లో (2024) గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఆ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు (4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు) చేయకపోవడంతో ఆమెను తదుపరి సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వేద మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడింది. 2017-18 సీజన్‌లో ఆమె హోబర్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించింది.