
PC: X
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు.
వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్
వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్‌లో జోసెఫ్ మూర్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్‌వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్‌ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.
రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథా
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది.
భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్‌లోనే జరుగనుంది.
ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.