టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.
తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.
అతడిని తప్పించండి
ఇలా వరుసగా గత మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్‌నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
సంజూకే నా మద్దతు..
క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్‌లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్‌గా సరైనోడే.
ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను.
వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలి
కానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్‌కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.


