ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష! | Why Iran Is No Easy Target US Can't Win Easily? Here Full Details | Sakshi
Sakshi News home page

ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!

Jul 2 2026 8:00 AM | Updated on Jul 2 2026 5:43 PM

Why Iran Is No Easy Target US Can't Win Easily? Here Full Details

దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్‌పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్‌కు సాధ్యమేనా?..

ఇరాన్ ఓ కంచుకోట..!
భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్‌లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..

1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్‌కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్‌లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్‌ల్యాండ్ నుంచి పైప్‌లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.

2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.

3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్‌లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్‌లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.

4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్‌కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్‌ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్‌లోకి దిగాల్సిందే.

5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్‌కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్‌లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్‌పై దాడికి ఇదే రూట్‌ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్‌లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్‌లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్‌లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్‌లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.
-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement