AUS VS ENG 3rd ODI: ఆసీస్‌ ఓపెనర్ల విధ్వంసం.. వార్నర్‌, హెడ్‌ వీర బాదుడు

Travis Head And David Warner Hits Hundreds In 3rd ODI VS England - Sakshi

3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి శతక్కొట్టుడు ధాటికి ఇంగ్లండ్‌ బౌలర్లకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. హెడ్‌, వార్నర్‌లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి.. ఇంగ్లీష్‌ ఫీల్డర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించారు.  ముఖ్యంగా హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి. పరుగుల వరద పారించాడు. వార్నర్‌, హెడ్‌ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు.

అయితే 39 ఓవర్లో పరుగు వ్యవధిలో వీరిద్దరూ ఔటవ్వడంతో ఆతిధ్య జట్టు 400 పరుగుల మైలురాయిని చేరుకునే సువర్ణావకాశాన్ని చేజార్చకుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ చివర్లో వర్షం పడటంతో మ్యాచ్‌ను చెరి 48 ఓవర్లకు కుదించగా.. ఆసీస్‌ తమ కోటా ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓల్లీ స్టోన్‌ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా, లియామ్‌ డాసన్‌కు ఓ వికెట్‌ దక్కింది.

అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై 221 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top