
నేడు భారత్, థాయ్‌లాండ్ మహిళల ఫుట్‌బాల్ జట్ల మధ్య రసవత్తర పోరు
గెలిచిన జట్టే ఆసియా కప్‌కు అర్హత
చియాంగ్ మయ్ (థాయ్‌లాండ్): ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత అమ్మాయిలకు అసలైన సవాల్ ఎదురవుతోంది. ర్యాంకింగ్‌లోనూ, పోటీలోనూ పటిష్టమైన థాయ్‌లాండ్‌తో ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు గ్రూప్ దశలోని ఆఖరి క్వాలిఫయింగ్ పోరు రసవత్తరంగా జరుగనుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో పాయింట్ల పరంగా, గోల్స్ పరంగా సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లలో గెలిచిన జట్టే ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధిస్తుంది.
ఏఎఫ్‌సీ ఆసియా కప్ టోర్నీ వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరుగుతుంది. ప్రస్తుత క్వాలిఫయర్స్‌లో సత్తా చాటుకున్నప్పటికీ థాయ్‌లాండ్‌పై ఏనాడూ గెలవని భారత్ ఈ చెత్త రికార్డును చెరిపేయాలన్నా... ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించాలన్నా సర్వశక్తులు ఒడ్డాల్సిందే! గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్ జట్లు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. ఇరాక్, తిమోర్–లెస్టే, మంగోలియాలపై గెలుపొందిన రెండు జట్లు ఇప్పుడు ఆఖరి లీగ్‌లో ఎదురుపడుతున్నాయి.
ఆఖరి మెట్టులో గట్టెక్కితే మాత్రం ఆసియా కప్ ఆడే అవకాశం లభిస్తుంది. ఇదే జరిగితే ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ (2027) క్వాలిఫికేషన్ టోర్నీ ఆడే జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. అందుకేనేమో కోచ్ క్రిస్పిన్ ఛెత్రి థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ విజయంతో వచ్చే ఆసియా కప్ బెర్త్‌తో భారత ఫుట్‌బాల్ ముఖచిత్రమే మారుతుందని అన్నారు. దేశ ఫుట్‌బాల్ క్రీడకే కొత్త ఊపిరినిస్తుందని చెప్పారు.
గతంలో 2003లో అమ్మాయిల జట్టు ఆసియా కప్ ఆడింది. కానీ అప్పుడు ఏఎఫ్‌సీ క్వాలిఫయర్స్ లేవు. ఎట్టకేలకు మళ్లీ మూడేళ్ల క్రితం 2022లో ఆతిథ్య జట్టుగా ఆడే భాగ్యం భారత్‌కు లభిస్తే ‘కరోనా’ మహమ్మారి గద్దలా తన్నుకుపోయినట్లు టోర్నీనే తుడిచి పెట్టేసింది. కోవిడ్ వల్ల భారత్ ఆ ఏడాది టోర్నీని నిర్వహించలేక పోయింది. ఇప్పుడు మాత్రం క్వాలిఫయింగ్ టోర్నీలో చేసిన పోరాటంతో దర్జాగా అర్హత సాధించాలనుకుంటున్న భారత్‌కు శనివారం విషమ పరీక్ష ఎదురవుతోంది.
13–0తో మంగోలియాపై, 4–0తో తిమోర్ లెస్టేపై, 5–0తో ఇరాక్‌పై గెలిచిన భారత్ ప్రత్యర్థులకు ఒక్క గోల్ ఇవ్వకుండా ఘనవిజయాలు సాధించింది. మరోవైపు థాయ్‌లాండ్ కూడా ఒక్క గోల్ ఇవ్వకుండానే జైత్రయాత్ర సాగించింది. ఈ ఆఖరి మజిలీనే ఇరు జట్లను ఒంటికాలుపై నిలబడేలా చేస్తుంది. సాధారణంగా గ్రూప్ దశలో షూటౌట్ నిర్వహించరు. అయితే ఇరు జట్లు సమఉజ్జీగా ఉండటంతో ఫలితం కోసం ఈ మ్యాచ్‌లో ‘షూటౌట్’ నిర్వహించడం ఖాయమైంది.