Champions Trophy: బీసీసీఐ, భారత విదేశాంగ శాఖది ఒకే మాట | There Are Other Options Too: BCCI VP On Hybrid CT Model MEA Says This | Sakshi
Sakshi News home page

Champions Trophy: బీసీసీఐ, భారత విదేశాంగ శాఖది ఒకే మాట

Published Fri, Nov 29 2024 4:20 PM | Last Updated on Fri, Nov 29 2024 6:04 PM

There Are Other Options Too: BCCI VP On Hybrid CT Model MEA Says This

చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాక్‌ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే, ఇరుదేశాల మధ్య పరిస్థితులు, భద్రతాకారణాల దృష్ట్యా బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు ససేమిరా అంటోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కూడా చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికలను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.

వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి
టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఐసీసీ వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేసింది. నేటితో చాంపియన్స్‌ ట్రోఫీ వేదికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్‌ శుక్లాను మీడియా పలకరించగా.. ‘‘మేము ఈ విషయంలో చర్చలు జరుపుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది.

ఏదేమైనా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. హైబ్రిడ్‌ మోడల్‌ అనే ఆప్షన్‌ కూడా ఉంది. అదే కాకుండా ఇంకా వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.

 

విదేశాంగ శాఖ కూడా ఇదే మాట
టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్‌ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్‌ఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ధ్రువీకరించారు. 

ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.

చదవండి: స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement