
బ్యాంకాక్: గాయాల కారణంగా సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడలేకపోయిన భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (Treesa Jolly) ద్వయం పునరాగమనం చేయనుంది. మంగళవారం నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం బరిలోకి దిగనుంది. తొలి రౌండ్‌లో ఒంగ్ జిన్ యి–కార్మెన్ తింగ్ (మలేసియన్) జంటతో గాయత్రి–ట్రెసా ద్వయం తలపడుతుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సహా యువ బ్యాడ్మింటన్ తారలు ఆయుశ్ షెట్టి, ఉన్నతి హుడాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 20 ఏళ్ల ఆయుశ్, 17 ఏళ్ల ఉన్నతిలు తమ జోరు కొనసాగించేందుకు పట్టుదలతో ఉన్నారు. గతవారం జరిగిన చైనీస్ తైపీ ఓపెన్‌లో ఈ ఇద్దరు సెమీఫైనల్స్ చేరి భారత బ్యాడ్మింటన్ భవిష్యత్‌కు కొత్త ఊపిరిలూదారు.
అయితే ఈ టోర్నీలో వీరిద్దరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆయుశ్, ఉన్నతిలు ఉన్న ఫామ్ దృష్ట్యా మెయిన్ ‘డ్రా’ చేరడం ఏమంత కష్టం కాదు. తొలి మ్యాచ్‌లో ఆయుశ్ ఫిన్‌లాండ్‌కు చెందిన జొకిమ్ ఒల్టార్ఫ్ తో, మహిళల క్వాలిఫయర్స్‌లో ఉన్నతి... స్థానిక ప్లేయర్ తమోన్‌వన్ నితిటిక్‌రాయ్‌తో తలపడతారు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి మ్యాచ్‌లో భారత స్టార్ లక్ష్యసేన్ ఐర్లాండ్ ఆటగాడు ఎన్‌హత్ నెన్‌గుయెన్‌ను ఎదుర్కొంటాడు.
గాయం నుంచి కోలుకోకపోవడంతో సుదిర్మన్ కప్‌కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ తాజా టోర్నీ ద్వారా తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోనున్నాడు. మరో మ్యాచ్‌లో నిలకడగా రాణిస్తున్న ప్రియాన్షు రజావత్... అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో భారత మేటి షట్లర్ మాళవిక న్సోద్... తుర్కియేకు చెందిన నెస్లిహన్ యిగిత్‌తో జరిగే తొలి రౌండ్ పోరుతో థాయ్ ఓపెన్‌ను ప్రారంభించనుంది. మిగతా మ్యాచ్‌ల్లో మాజీ జాతీయ చాంపియన్ అనుపమకు మొదటి రౌండ్లోనే గట్టి సవాల్ ఎదురవుతోంది. ఆమె మాజీ ప్రపంచ చాంపియన్ రత్చనోక్ ఇంతనాన్ (థాయ్‌లాండ్)ను ఎదుర్కోనుంది.