
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.
తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.