ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లకు గాయాల బెడద మొదలైంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు తమ కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
కేకేఆర్‌కు డబుల్ షాక్..!
ఈ ఏడాది సీజన్‌కు ముందు మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మోకాలి గాయం సర్జరీ కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆకాశ్ మధ్వాల్ లేదా చేతన్ సకారియాను తీసుకునే అవకాశముంది.
మరోవైపు వేలంలో రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా ఈ ఏడాది సీజన్‌లో ఆడేది అనుమానమే. అంతేకాకుండా రాజకీయ ఉద్రిక్తల కారణంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కూడా కేకేఆర్ కోల్పోవల్సి వచ్చింది. అయితే అతడి స్దానంలో జింబాబ్వే స్పీడ్ గన్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకున్నారు.
ఆర్సీబీ ఆందోళన
ఈ టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్, ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. హేజిల్‌వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్న పేసర్ యశ్ దయాల్ ఆడడంపై కూడా సందిగ్ధం నెలకొంది. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కెప్టెన్ సాబ్ వస్తాడా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటుపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కమ్మిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ సమయానికి తను పూర్తిగా కోలుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమ్మిన్స్ తెలిపాడు.
అదేవిధంగా మరో ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుంగా గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ సైతం గాయంతో పోరాడుతున్నాడు. అతడు కూడా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.
న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే కూడా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ.2.25 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా ఈ జాబితాలో ఉన్నాడు.
గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్ మధ్యలోనే వైదొలిగాడు. సీఎస్‌కే యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అందుబాటుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభం కానుంది.
చదవండి: ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?


